Cyber Criminals: ఆఫర్ల వల.. చిక్కితే విలవిల
ABN , Publish Date - Dec 09 , 2025 | 09:42 AM
సైబర్ నేరగాళ్లు మరో మోసానికి తెరలేపారు. ప్రముఖ సంస్థల పేర్లు వాడుకుంటూ.. ఆఫర్లు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నగరంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైటర్ మోసగాళ్ల చేతిలో బలవుతూనే ఉన్నారు. లక్షలాది రూపాయలను పొగొట్టుకుంటూనే ఉన్నారు.
- ప్రముఖ సంస్థల పేర్లతో ఆన్‌లైన్ ప్రకటనలు
- లింక్‌లు పంపించి మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: సైబర్ నేరగాళ్లు ప్రతీ అంశాన్ని దోపిడీకి అనువుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రముఖ సంస్థల పేర్లు వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. డీమార్ట్‌లో ఆఫర్.. కిలో బాదం పప్పు, కిలో జీడిపప్పు, కిలో కిస్‌మిస్, కిలో పిస్తా కేవలం రూ. 399 మాత్రమే. ఆఫర్ ధరలో కొనుగోలు చేయాలంటే కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి. ‘‘ప్రముఖ ఈ కామర్స్ సైట్ మీషోలో రూ. 499కే ఫోల్డబుల్ సోఫా కం బెడ్. ఇది ఉదయం సోఫాగా, రాత్రి బెడ్‌గా మారుతుంది. ఆఫర్ కావాలంటే లింక్ క్లిక్ చేయండి’’.. ఇలాంటి ప్రకటనలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తరచూ ప్రత్యక్షం అవుతుంటాయి.
వీటిని ఓపెన్ చేసి వివరాలు నమోదు చేస్తే.. సంప్రదించిన సైబర్ నేరగాళ్లు ఏపీకే లింక్‌లు పంపించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన కేసులో హబ్సిగూడకు చెందిన వృద్ధుడు ఫేస్‌బుక్‌లో డీమార్ట్ పేరుతో ఆఫర్ ప్రకటన చూశాడు. కొనుగోలు చేద్దామని లింక్‌ను క్లిక్ చేసి పోన్ నెంబర్, వివరాలు నమోదు చేయగానే కొందరు కాంటాక్ట్ చేశారు. ఆపర్ వర్తించాలంటే ముందుగా ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని చెబుతూ వాట్సా్‌పలో ఏపీకే లింక్ పంపారు. బాధితుడు లింక్ ఓపెన్ చేసి అందులో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయగానే సైబర్ నేరగాళ్లు ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంకు ఖాతాల నుంచి మూడు దఫాలుగా రూ.1.09 లక్షలు బదిలీ చేసుకున్నారు.
స్పిన్ వీల్, స్ర్కాచ్ కార్డ్ ఆఫర్ల పేరుతో..
ఆన్‌లైన్‌లో ఉండగా అకస్మాత్తుగా స్పిన్ వీల్ గేమ్, స్ర్కాచ్ కార్డ్ పాప్‌అప్ అవుతుంది. ఈ గేమ్‌లో తక్కువ ధరకే ల్యాప్‌టాప్, ఫోన్‌లు ఉంటాయి. నకిలీ వెబ్‌సైట్ రూపొందించిన సైబర్ నేరగాళ్లు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన వారిని మోసం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇదేదో బాగుందని స్పిన్ చేస్తే.. వెంటనే మీరు రూ.999కే ఐ ఫోన్ గెలిచారు. ఫోన్ పొందాలంటే కింద ఉన్న లింక్‌లో వివరాలు నమోదు చేయాలని సూచిస్తూ సందేశం వస్తుంది.

లింక్ తెరిచిన వారికి అపరిచిత వెబ్‌సైట్ తెరుచుకుంటుంది. ఈ వెబ్‌సైట్‌లో తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువులు, దుస్తులు, పరికరాలు అందుబాటులో ఉంటాయి. కొనుగోలు చేద్దామని ఆర్డర్ చేస్తే ఈ ఆఫర్ ఆన్‌లైన్ పేమెంట్‌కు మాత్రమే వర్తిస్తుందని.. క్యాష్ ఆన్ డెలివరీకి వర్తించదని చెబుతారు. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే డబ్బులు వసూలు చేసుకుంటారు. వస్తువుల కోసం సంప్రదిస్తే పార్సిల్, కొరియర్, రిఫండబుల్ అంటూ మరికొంత వసూలు చేస్తారు. ఇంకా డబ్బు రిఫండ్ కోసం యత్నిస్తే ఓటీపీ చెప్పమంటూ ఖాతా ఖాళీ చేస్తున్నారు.
ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలోనే కొనండి
కొత్త పేర్లతో వెబ్‌సైట్, వాటికి అనుబంధంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్న సైబర్ నేరగాళ్లు తక్కువ ధరకే వస్తువులంటూ మోసాలు చేస్తున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో కొనుగోలు చేయడం సురక్షితం. సైబర్ నేరగాళ్లు పంపే లింక్ క్లిక్‌ల ద్వారా ఓపెన్ అయ్యే సైట్లలో వ్యక్తిగత వివరాలు నమోదు చేయొద్దు.
- సైబర్ క్రైం అధికారులు
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News