Boost Consumer Confidence: భారత ఆర్థిక వ్యవస్థలో పెరిగిన వినియోగదారుల విశ్వాసం
ABN , Publish Date - Sep 24 , 2025 | 10:17 AM
భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకుంది. ప్రైమరీ కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ (PCSI) ప్రకారం సెప్టెంబర్‌లో జాతీయ ఇండెక్స్‌లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మలేషియాను అధిగమించి టాప్ స్థానాల్లో ఒకటిగా నిలిచింది.
భారత్ ఆర్థిక స్థిరత్వం, వినియోగదారుల విశ్వాసాన్ని మరోసారి ప్రతిబింబిస్తూ గ్లోబల్ వేదికపై తన ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల మనోభావాలను అంచనా వేసే LSEG-Ipsos ప్రైమరీ కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ (PCSI) ప్రకారం, సెప్టెంబర్ నెలకు భారత్ రెండో స్థానంలో నిలిచింది. గత నెలలో 57.6గా ఉన్న జాతీయ ఇండెక్స్ స్కోర్ ఈ నెలలో 57.0కి స్వల్పంగా తగ్గినప్పటికీ, భారతదేశం తన వినియోగదారుల విశ్వాసంలో స్థిరత్వాన్ని కొనసాగిస్తోంది.
ఇది భారత్‌లో నమ్మకమైన ఆర్థిక ప్రగతిని, వినియోగదారుల భద్రతా భావనను ప్రతిబింబిస్తోంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదాయం, వ్యయ సామర్థ్యం, భవిష్యత్ ఆర్థిక స్థిరత్వంపై ప్రజలలో నెలకొన్న విశ్వాసం ఇవన్నీ ఈ పురస్కార స్థాయిలో ప్రతిఫలించాయి. గ్లోబల్ అస్థిరత నేపథ్యంలో భారత్ చూపిస్తున్న స్థిరత్వం, అభివృద్ధి పట్ల ఉన్న పట్టుదల, అంతర్జాతీయంగా మరింత ఆదరణ పొందుతున్నాయి.
ఆగస్టులో కనిపించిన ఆందోళనలు, వినియోగదారుల విశ్వాసంలో క్షీణత తర్వాత, సెప్టెంబర్‌లో భారతదేశంలో వినియోగదారుల మనోభావం స్థిరపడిందని ఇప్సోస్ ఇండియా CEO సురేష్ రామలింగం అన్నారు. ప్రపంచ సమస్యలు భారతీయ వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, దేశీయ పరిణామాలు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.
సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన GST 2.0 సంస్కరణలు వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగా నిలిచాయి. GST రేట్లను 5%, 18% స్టాండర్డ్ శ్లాబ్‌లుగా సరళీకరించడం ద్వారా, జీవన వ్యయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఊరట కల్పించింది. ఉదాహరణకు ప్యాసింజర్ కార్లపై GST రేటు 28% నుంచి 18%కి తగ్గడం ద్వారా వినియోగదారులు గణనీయమైన సొమ్మును ఆదా చేసుకోవచ్చు. ఈ సంస్కరణలు వినియోగదారులతో పాటు వ్యాపారాలకు కూడా అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
ఎక్కడ ఎలా ఉంది?
గ్లోబల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ప్రకారం సింగపూర్ (54.4), స్వీడన్ (54.4), మలేషియా (54.1), ఆస్ట్రేలియా (53.9), నెదర్లాండ్స్ (52.8), మెక్సికో (52.7), అమెరికా (52.4), ఇండోనేషియా (52.3), బ్రెజిల్ (51.7), పోలాండ్ (50.6), ఐర్లాండ్ (50.0) వంటి 11 దేశాలు 50 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించాయి. అదే సమయంలో ఫ్రాన్స్ (39.9), జపాన్ (37.3), టర్కీ (35.4), హంగరీ (34.7) వంటి నాలుగు దేశాలు 40 పాయింట్ల కంటే తక్కువ స్కోర్ నమోదు చేశాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి