Sensex Nifty Record Highs: సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డులు..స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో రికార్డ్
ABN , Publish Date - Sep 17 , 2025 | 10:38 AM
భారత స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ 17న మరోసారి దుమ్మురేపింది. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజు తమకు తాము సవాల్ విసిరినట్టు సరికొత్త గరిష్ఠాల్ని చేరాయి. ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ చర్చలు సానుకూల దిశగా సాగాయన్న సంకేతాలతో ఇన్వెస్టర్ల ఉత్సాహం పెరిగింది.
భారత స్టాక్ మార్కెట్ ఈరోజు మంచి జోష్‌లో ఉంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ వరుసగా రెండో రోజు సరికొత్త రికార్డులకు (Sensex Nifty Record Highs) చేరాయి. సెప్టెంబర్ 17న ఇండియా-యూఎస్ ట్రేడ్ టాక్స్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు మళ్లీ షేర్ల కొనుగోళ్లలో మునిగిపోయారు. ఈ ఉత్సాహంలో నిఫ్టీ మొదటిసారి జూలై 11 తర్వాత 25,300 మార్క్‌ని అధిగమించింది. ఇప్పుడు అందరి దృష్టి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రిజల్ట్‌పై ఉంది.
ఈ రాత్రి వచ్చే ఫెడ్ నిర్ణయంలో 25 బేసిస్ పాయింట్ల రేట్ కట్ ఉంటుందని మార్కెట్ ఆశిస్తోంది. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్ 253.74 పాయింట్లు (0.31%) పెరిగి 82,634.43 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 83 పాయింట్లు (0.31%) పుంజుకుని 25,322.10కి చేరింది. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ధోరణిలో ఉంది. ఈ క్రమంలో 2,298 షేర్లు పాజిటివ్ ట్రెండులో ఉండగా, 759 షేర్లు కిందకి, 156 షేర్లు స్థిరంగా ఉన్నాయి.
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు కూడా ఈ జోష్‌లో భాగమయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్‌లు 0.3% వరకు పెరిగాయి. ఇండియా VIX, అంటే వోలటిలిటీ గేజ్, కొంచెం పెరిగినా పెద్దగా భయపడాల్సిన పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. ఆటో స్టాక్స్ మాత్రం ఈ ర్యాలీలో సూపర్‌స్టార్లలా మెరిశాయి. మునుపటి సెషన్స్‌లోనూ వీటి జోరు కొనసాగింది. ఇక ఐటీ స్టాక్స్ కూడా ఫెడ్ పాలసీకి ముందు మంచి ట్రాక్షన్ సంపాదించాయి. యూఎస్‌లో రేట్ కట్ సైకిల్ వస్తే, గ్లోబల్ గ్రోత్‌కి తోడ్పడుతుంది కాబట్టి భారత ఐటీ సర్వీసెస్ కంపెనీలు లాభపడతాయని అనలిస్ట్‌లు చెబుతున్నారు.
మార్కెట్ ట్రెండ్ ఇంకా పాజిటివ్‌గానే ఉందని, నిఫ్టీ 25,100, సెన్సెక్స్ 82,000 కంటే పైన ఉంటే ఈ జోష్ కొనసాగుతుందని కోటక్ సెక్యూరిటీస్‌లో ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ అన్నారు. రాబోయే రోజుల్లో నిఫ్టీ 25,400, సెన్సెక్స్ 82,800 లేదా 25,500/83,100 స్థాయిలకు కూడా చేరొచ్చని అంచనా వేశారు. కానీ, ఒకవేళ 25,100/82,000 కంటే కిందకి జారితే, సెంటిమెంట్ నెగటివ్ అవుతుందన్నారు.
నోట్: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి