Sensex Crashes: వెయ్యి పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. ఎందుకీ నష్టాలు, కారణాలేంటీ..
ABN , Publish Date - May 22 , 2025 | 02:00 PM
దేశీయ స్టాక్ మార్కెట్ కూప్పకూలింది. ఈ క్రమంలో నేడు (మే 22, 2025న) సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు నష్టపోగా, మిగతా సూచీలు కూడా భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
భారత స్టాక్ మార్కెట్ (Indian stock market) ఈరోజు (మే 22, 2025న) భారీ నష్టాల దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ సూచీ ఒక్క రోజులోనే 1,000 పాయింట్లకు పైగా నష్టపోయింది (Sensex Crashes). దీంతో మార్కెట్ ప్రారంభంలోనే రూ. 2.5 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ 50 కూడా ఈ రోజు దాదాపు 300 పాయింట్లు కోల్పోయి, 24,400 స్థాయికి దిగజారింది.
నష్టాల వెనుక కారణాలు
మే 22కి ముందు, సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. ముఖ్యంగా మే 19న భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి ఒప్పందం కారణంగా దాదాపు 4% పెరిగాయి. ఈ ర్యాలీలో సెన్సెక్స్ 81,186.44 నుంచి గణనీయమైన లాభాలను సాధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను రూ. 4,32,56,125.65 కోట్లకు పెంచింది. అయితే, ఈ గణనీయమైన లాభాల తర్వాత, పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించేందుకు (profit booking) షేర్లను విక్రయించడం ప్రారంభించారు. ఇది మే 22న సెన్సెక్స్‌లో 1,000 పాయింట్ల పతనానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్‌లపై అనిశ్చితి, గ్లోబల్ ట్రేడ్ ఒత్తిళ్లు, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి అంశాలు కూడా భారత మార్కెట్‌పై ప్రభావం చూపాయని అంటున్నారు.
సెక్టోరల్ ఒత్తిళ్లు
మరోవైపు అమెరికా డాలర్ బలపడటం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం వల్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (FPIs) భారత మార్కెట్ నుంచి నిధులను ఉపసంహరించుకున్నారు. ఇది సెన్సెక్స్‌పై అదనపు ఒత్తిడిని సృష్టించింది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు FPIలు రూ. 1 లక్ష కోట్లకు పైగా ఉపసంహరించుకున్నట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) డేటా వెల్లడించింది. ఐటీ, ఆటో, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలు కూడా సెన్సెక్స్ పతనాన్ని తీవ్రతరం చేసింది. ఇన్ఫోసిస్ (3.54%), టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి కంపెనీలు గణనీయమైన నష్టాలను చవిచూశాయి. ఈ సెక్టార్లలో అధిక వాల్యుయేషన్లు, ఆదాయాలలో మందగమనం పెట్టుబడిదారులలో ఆందోళనను రేకెత్తించాయి.
ఈ కారణాలు కూడా..
భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి ఒప్పందం తర్వాత కొంత ఆశావాదం నెలకొన్నప్పటికీ, కశ్మీర్‌లో ఇటీవలి ఉగ్రవాద దాడులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ అంశాలు పెట్టుబడిదారులలో జాగ్రత్తను పెంచాయి, ఫలితంగా విక్రయాలు పెరిగాయి. సెన్సెక్స్‌తో పాటు, ఇతర సూచీలు కూడా నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 2.5% క్షీణించగా, స్మాల్‌క్యాప్ సూచీ 3% వరకు నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్ సూచీలోని అన్ని 12 బ్యాంకులు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన లాసర్స్‌గా నిలిచాయి. దీంతో మే 22, 2025న బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2.52 లక్షల కోట్లకు పైగా తగ్గింది. ఇది రూ. 420.83 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది.
ఇవీ చదవండి:
పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్..
విమానంపై వడగళ్ల వాన.. 227 మంది ఉన్న ఫ్లైట్‌కు తప్పిన ఘోర ప్రమాదం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి