Cheque Clearing RBI: పాత రూల్స్‌కు గుడ్‌బై.. అక్టోబర్ 4 నుంచి చెక్ క్లియరెన్స్‌కు కొత్త విధానం
ABN , Publish Date - Oct 03 , 2025 | 07:27 PM
చెక్ క్లియరెన్స్ ప్రక్రియలో అక్టోబర్ 4 నుంచి సంచలన మార్పులు రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. దీని ద్వారా చెక్‌లు ఇకపై గంటల్లోనే క్లియర్ అవుతాయి.
చెక్ క్లియరెన్స్ (Cheque Clearance) విషయంలో అక్టోబర్ 4, 2025 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ కొత్త విధానం ద్వారా చెక్‌లు కేవలం కొన్ని గంటల్లోనే క్లియర్ అవుతాయి. గతంలో చెక్‌లు క్లియర్ కావడానికి రెండు పని దినాలు పట్టేవి. కానీ, అక్టోబర్ 4 నుంచి అమలులోకి వచ్చే కొత్త విధానంతో, ఒకే రోజులో కొన్ని గంటల్లోనే మీ చెక్ క్లియర్ అవుతుంది.
ఈ విధానం చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) ఆధారంగా పనిచేస్తుంది. CTSలో చెక్‌ను భౌతికంగా బ్యాంకుకు పంపాల్సిన అవసరం లేదు. చెక్ ఫొటో వివరాలు డ్రాయీ బ్యాంకుకు పంపబడతాయి. దీని వల్ల క్లియరెన్స్ వేగవంతం అవుతుంది. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు ఈ మార్పును స్వాగతిస్తూ, తమ కస్టమర్లకు కొత్త విధానాల గురించి సమాచారం అందిస్తున్నాయి.
భద్రత కూడా
చెక్‌ల భద్రతను పెంచడానికి RBI పాజిటివ్ పే సిస్టమ్‌ను తప్పనిసరి చేసింది. ఈ విధానంలో రూ.50,000 కంటే ఎక్కువ విలువైన చెక్‌ల కోసం కస్టమర్లు ముందుగానే కొన్ని వివరాలు బ్యాంకుకు సమర్పించాలి. వాటిలో అకౌంట్ నంబర్, చెక్ నంబర్, చెక్ తేదీ, చెక్ మొత్తం లబ్ధిదారుడి పేరు తెలియజేయాలి. ఈ వివరాలను చెక్ డిపాజిట్ చేయడానికి కనీసం 24 పని గంటల ముందు బ్యాంకుకు ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.
బ్యాంక్ వాటిని ధృవీకరించిన తర్వాత చెక్ వివరాలు సరిపోలితే క్లియర్ అవుతుంది. ఒకవేళ వివరాలు సరిపోలకపోతే చెక్ తిరస్కరించబడుతుంది. మీరు మళ్లీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రూ.5లక్షల కంటే ఎక్కువ విలువైన చెక్‌లకు పాజిటివ్ పే సిస్టమ్ తప్పనిసరి. అయితే రూ.50,000 పైన ఉన్న చెక్‌లకు దీనిని ఉపయోగించమని బ్యాంకులు సిఫార్సు చేస్తున్నాయి.
చెక్ బౌన్స్ కాకుండా జాగ్రత్తలు
చెక్ బౌన్స్ కాకుండా ఉండాలంటే మీ బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి. అలాగే, చెక్‌లోని వివరాలను కూడా జాగ్రత్తగా నింపాలి.
మొత్తాన్ని అక్షరాల్లో, అంకెల్లో సరిగ్గా రాయాలి.
చెక్ తేదీ సరైనదిగా ఉందో లేదో చూసుకోవాలి.
లబ్ధిదారుడి పేరు, మొత్తంలో ఎలాంటి దిద్దుబాట్లు ఉండకూడదు.
మీ సంతకం బ్యాంక్ రికార్డులతో సరిపోలాలి.
ఈ చిన్న జాగ్రత్తలు మీ చెక్ తిరస్కరణను నివారిస్తాయి.
కొత్త విధానం దశలు
RBI ఈ కొత్త విధానాన్ని రెండు దశల్లో అమలు చేయనుంది. మొదటి దశ అక్టోబర్ 4, 2025 నుంచి మొదలవుతుంది. రెండో దశ జనవరి 3, 2026 నుంచి అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానం చెక్ క్లియరెన్స్‌ను వేగవంతం చేయడమే కాకుండా, మీ లావాదేవీలను మరింత సురక్షితం చేస్తుంది. కస్టమర్లు తమ చెక్ వివరాలను జాగ్రత్తగా నింపడం, పాజిటివ్ పే సిస్టమ్‌ను ఉపయోగించడం ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి