Pakistan Super Rich: సంక్షోభం నుంచి సంపద వైపు పాకిస్తాన్.. సూపర్ రిచ్ అవుతుందా
ABN , Publish Date - Aug 14 , 2025 | 10:11 AM
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్ భవిష్యత్తులో సూపర్ రిచ్ దేశాల జాబితాలో చేరనుంది. ఇటీవల నివేదికల ప్రకారం ఈ దేశంలో దాదాపు $3 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ విలువ చేసే అరుదైన ఖనిజ సంపద దాగి ఉందట. ఇవి పాకిస్తాన్ దేశ విధానాన్ని మార్చనున్నాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసింది. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఈ దేశం సూపర్ రిచ్ (Pakistan Super Rich) కానుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఎలాగంటే దాదాపు $3 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ (రూ.43,72,02,00,00,00,000) విలువైన అరుదైన ఖనిజాలు ఈ దేశంలో దాగి ఉన్నాయట. ఇప్పుడు ఈ ఖనిజ సంపదను తవ్వి ప్రపంచ దేశాలతో వ్యాపారం చేయడానికి పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా, సౌదీ అరేబియా, యూకే, టర్కీ, యూఏఈ లాంటి దేశాలు ఈ అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఖనిజ సంపద ఎక్కడుంది?
పాకిస్తాన్‌లో బొగ్గు, రాగి, బంగారం, ఇనుము, క్రోమైట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు గనులు, ఐదో అతిపెద్ద రాగి, బంగారం గనులు ఇక్కడే ఉన్నాయంటా. ఈ ఖనిజాలు బలూచిస్తాన్ భూభాగం నుంచి ఉత్తరాన ఉన్న పర్వత ప్రాంతాలు, పంజాబ్ సారవంతమైన భూములు, సింధ్ భూముల వరకు అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయని చెబుతున్నారు. ఇంత సంపద ఉన్నా కూడా ఇప్పటివరకు ఈ గనులను సరిగ్గా వినియోగించలేదు.
పెట్టుబడుల కోసం కొత్త ప్లాన్
కానీ, ఇప్పుడు ఈ విషయంలో పెద్ద మార్పు రాబోతోంది. అంతర్జాతీయ పెట్టుబడులను సులభతరం చేయడానికి, ఈ గనుల నిర్వహణను ప్రాంతీయ అధికారం నుంచి కేంద్ర అధికారానికి మార్చాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రాజ్యాంగ సవరణ అవసరం. దానికి సంబంధించిన చట్టం ఇప్పుడు సమీక్షలో ఉంది. ఈ మార్పు వస్తే, విదేశీ కంపెనీలకు బిడ్డింగ్, రెగ్యులేటరీ అనుమతులు, సెక్యూరిటీ క్లియరెన్స్‌లు సులభంగా జరుగుతాయి. అంటే పెట్టుబడులు వేగంగా రాబోతున్నాయి.
ఎవరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు?
నివేదికల ప్రకారం రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో విదేశీ కంపెనీలతో ఒప్పందాలు ఖరారు కానున్నాయి.
చైనా: గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతంలో ఖనిజాల తవ్వకం హక్కులు పొందే అవకాశం ఉంది. చైనా ఇప్పటికే పాకిస్తాన్‌లో అనేక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోంది.
అమెరికా: ఉత్తర బెలూచిస్తాన్, దక్షిణ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో మైనింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే హక్కులు పొందవచ్చు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్తాన్ ఖనిజ, ఇంధన రంగాలపై ఆసక్తి చూపారట.
సౌదీ అరేబియా: రేకో డిక్ రాగి-బంగారం గనులపై దృష్టి సారించింది. ఈ గనులు ప్రపంచంలోనే అత్యుత్తమ రాగి, బంగారం నిక్షేపాలలో ఒకటిగా పరిగణించబడతాయి. సౌదీతో చర్చలు దాదాపు చివరి దశలో ఉన్నాయట.
ఎవరు ముందున్నారు?
పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా, యూకే, చైనా, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ లాంటి దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులతో డీల్స్ కుదుర్చుకుంటోంది. వీటి కోసం ప్రభుత్వం ఒక సులభమైన వన్-స్టాప్ సొల్యూషన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. తద్వారా పెట్టుబడిదారులకు అన్ని అనుమతులు, సౌకర్యాలు ఒకే చోట దొరుకుతాయి. ఈ ఖనిజ సంపద పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ గనులు సరిగ్గా వినియోగించబడితే ఉద్యోగాలు, ఆదాయం, ఆర్థిక అభివృద్ధి వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి