Ola Electric Shares: ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఒక్క నెలలోనే 53% ర్యాలీ.. కొనసాగుతుందా?
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:49 PM
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఈ షేర్లు గడిచిన ఒక్క నెలలోనే ఏకంగా 53% వరకు జంప్ అయ్యాయి. అసలు ఏమైంది, ర్యాలీకి కారణం ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ షేర్లు హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే ఇవి ఒక్క నెలలోనే 53% ర్యాలీ చేశాయి. అవును, మీరు చదివింది నిజమే. సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 15.42% జంప్ చేసి రూ.62.97 గరిష్ఠ స్థాయికి చేరుకుంది (ola electric mobility Shares). గత ఏడాదితో పోలిస్తే ఇంకా 45.98% తక్కువగానే ఉంది. కానీ ఇటీవల ఈ స్టాక్ ఎందుకు పెరిగిందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
షేర్ మార్కెట్‌లో హై వోల్టేజ్
ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఈ మధ్య బాగా వోలటైల్‌గా ఉన్నాయి. అందుకే BSE, NSE ఈ షేర్‌ను షార్ట్-టర్మ్ అడిషనల్ సర్వీలెన్స్ మెజర్ (ASM) ఫ్రేమ్‌వర్క్ కింద ఉంచాయి. దీనివల్ల ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరిక లాంటిది జారీ అయింది. ఎందుకంటే ధరల్లో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ హై వోల్టేజ్ డ్రామా వెనక ఓలా ఎలక్ట్రిక్ చేస్తున్న కొన్ని అద్భుతమైన పనులే కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఓలా ఎలక్ట్రిక్‌లో ఏంటి స్పెషల్
ఓలా ఎలక్ట్రిక్, ఇటీవల తమ Gen3 స్కూటర్ పోర్ట్ ఫోలియో కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ కింద అర్హత సర్టిఫికేషన్ పొందింది. అంటే, ప్రభుత్వం నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తాయన్నమాట. అంతేకాదు, తమిళనాడులోని గిగాఫ్యాక్టరీలో జరిగిన సంకల్ప్ ఈవెంట్‌లో ఓలా తమ మొదటి స్వదేశీ 4680 భారత్ సెల్ బ్యాటరీని ఆవిష్కరించింది. దీంతోపాటు రేర్ ఎర్త్ మెటల్-ఫ్రీ మోటార్‌ను కూడా పరిచయం చేసింది. ఈ రెండూ ఓలాకు గేమ్ ఛేంజర్‌గా ఉండబోతున్నాయి.
ఉత్పత్తి ఖర్చులు..
ఈ కొత్త బ్యాటరీ, మోటార్ వల్ల ఓలా ఎలక్ట్రిక్ ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి, లాభాలు బాగుంటాయి. ఇది ఇన్వెస్టర్లకు మంచి సిగ్నల్. వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ ఈ విషయం గురించి చెప్పారు. మేనేజ్‌మెంట్ కామెంటరీ, లాభదాయకత రీవైవల్ సంకేతాలతో ఓలా ఎలక్ట్రిక్ మళ్లీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్ సెల్ లాంచ్ వల్ల మార్జిన్స్ మెరుగవుతాయి, లాభాలు పెరుగుతాయి. ఇది షేర్‌పై కొత్త ఫోకస్‌ను తెచ్చింది.
టెక్నికల్ అనాలిసిస్
నీలేష్ జైన్, సెంట్రమ్ బ్రోకింగ్‌లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఓలా ఎలక్ట్రిక్ షేర్ బుల్లిష్‌గా ఉందన్నారు. ఆరు నెలల కన్సాలిడేషన్ తర్వాత, షేర్ ఇప్పుడు స్ట్రక్చరల్ రీబౌండ్‌లో ఉందన్నారు. ఈ క్రమంలో దీని ధర త్వరలో రూ. 65-70 రేంజ్‌కి వెళ్లే అవకాశం ఉందన్నారు. లాంగ్-టర్మ్ ఇన్వెస్టర్లు రూ. 54 వద్ద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరో నిపుణుడు పటేల్ ఈ స్టాక్ రూ. 54 వద్ద సపోర్ట్, రూ.62 వద్ద రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పాడు. షేర్ రూ.62–65 రేంజ్‌లో ట్రేడ్ అవుతుందని, ఒకవేళ రూ. 62 పైన స్థిరంగా ఉంటే, మరింత పైకి వెళ్లే ఛాన్స్ ఉందని విశ్లేషించారు.
ఓలా ఎలక్ట్రిక్ స్థాపన
ఓలా ఎలక్ట్రిక్ 2017లో స్థాపించబడింది. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్లు, బ్యాటరీ ప్యాక్‌లు, మోటార్లు, ఫ్రేమ్‌ల వంటి కీలక భాగాలను తయారు చేస్తుంది. ఇవన్నీ ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతాయి. జూన్ 2025 నాటికి బెంగళూరు ఆధారిత ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 36.78%గా ఉంది.
గమనిక: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా, సూచనలు పాటించడం మంచిది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి