New Tax Regime India: కొత్త ఆదాయపు పన్ను చట్టం..అమలు తేదీ ఖరారు
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:49 PM
భారత ప్రభుత్వం తాజాగా ఇంకమ్ ట్యాక్స్ చట్టం 2025ను అధికారికంగా ప్రకటించింది. ఇండియాలో 60 ఏళ్ల క్రితం ఉన్న ఆదాయపు పన్ను చట్టం 1961ని మార్చి, కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ని అధికారికంగా ప్రవేశపెట్టింది. తాజాగా దీని అమలు తేదీని ప్రకటించారు.
భారత ప్రభుత్వం కొత్త ఇంకమ్ ట్యాక్స్ చట్టం 2025ను (New Tax Regime India 2025) అధికారికంగా ప్రకటించింది. ఇది ఇప్పటికే దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా ఉన్న 1961 నాటి ఇంకమ్ ట్యాక్స్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, కొత్తగా తీసుకొచ్చిన చట్టం. ఈ కొత్త చట్టానికి ఆగస్టు 21న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు.
ఏం కొత్తగా ఉంది?
ఈ కొత్త చట్టంలో కొత్త పన్ను రేట్లు ఏమీ లేవు, కానీ భాషని సరళంగా మార్చారు. పాత చట్టంలో 819 సెక్షన్లు, 47 చాప్టర్లు, 5.12 లక్షల పదాలు ఉండేవి. కొత్త చట్టంలో ఇవి 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 2.6 లక్షల పదాలకు తగ్గించారు. అంటే చట్టం చిన్నగా, ఈజీగా మార్చు చేశారు.
ఈ మార్పులు చిన్నవి కావని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇది పన్ను విధానాన్ని సులభతరం చేసే కొత్త విధానం. చట్టం సులభంగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి, అమలు చేయడానికి రూపొందించ బడిందని తెలిపారు.
ఎందుకు ఈ మార్పు?
పాత ఆదాయపు పన్ను చట్టం 1961 చాలా క్లిష్టంగా ఉండేది. దీని భాష వల్ల చాలా గందరగోళం, వివాదాలు వచ్చేవి. వివిధ సమయాల్లో వివిధ రీతుల్లో రాసిన ఈ చట్టం అందరికీ అర్థం కావడం కష్టం. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు, అధికారుల మధ్య చాలా వివాదాలు తలెత్తేవి. కొత్త చట్టం ఈ సమస్యలను తగ్గించడానికి, చట్టాన్ని ఈజీగా, అందరికీ అర్థమయ్యేలా రూపొందించారు.
ఎలా ఆమోదం?
ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ని పార్లమెంట్ ఆగస్టు 12, 2025న ఆమోదించింది. లోక్‌సభ ఆగస్టు 11న, రాజ్యసభ ఆగస్టు 12న ఈ బిల్లును ఆమోదించాయి. పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ సిఫార్సులను చేర్చి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సవరించిన రూపంలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 21న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఇది చట్టంగా మారింది.
మనకు ఉపయోగం ఏంటి?
ఈ కొత్త చట్టం వల్ల పన్ను చెల్లించేవారికి, వ్యాపారవేత్తలకు, సామాన్యులకు చట్టం అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. పాత చట్టంలోని క్లిష్టమైన భాష, పాత పదాలు తొలగించి, సరళమైన భాషలో రాశారు. ఇది వివాదాలను తగ్గించి, పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా చేస్తుంది. ఈ చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే, మనం ఇప్పటి నుంచి కొత్త, సులభమైన పన్ను విధానానికి సిద్ధం కావచ్చు. ఈ మార్పు మన ఆర్థిక వ్యవస్థను మరింత సులభతరం చేయనుంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి