ITR Filing Due Date Extension: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైలింగ్ గడువు మరోసారి పొడిగిస్తారా..క్లారిటీ.
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:12 PM
ఐటీఆర్ దాఖలు విషయంలో టెక్నికల్ గ్లిచ్‌లు, ITR ఫారాల యుటిలిటీల ఆలస్యం సహా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని సీఏలు సహా పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీని గడువు పొడిగించాలని కోరుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
పన్ను చెల్లింపు దారులు, ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు (HUF) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం చాలా ముఖ్యం. 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు తేదీని ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే 45 రోజులు పొడిగించింది. అంటే, జూలై 30, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు గడువు పెంచారు. అయితే ఈ గడువును ఇప్పుడు మళ్లీ పొడిగించే అవకాశం ఉందా (ITR Filing Due Date Extension) అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
గడువు పొడిగింపునకు కారణాలు ఏంటి?
పన్ను సంఘాలు, చార్టర్డ్ అకౌంటెంట్లు (CAs), పన్ను నిపుణులు ఐటీఆర్ దాఖలు గడువును మరింత పొడిగించాలని కోరుతున్నాయి.
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో వెబ్సైట్లలో సాంకేతిక లోపాలు, సర్వర్ క్రాష్‌లు, డేటా అసమానత వంటి సమస్యలు వస్తున్నాయి.
ITR-2, ITR-3, ITR-5, ITR-6, ITR-7 ఫారమ్‌ల కోసం ఎక్సెల్ యుటిలిటీలు ఆలస్యంగా విడుదలయ్యాయి. ఉదాహరణకు ITR-2, ITR-3 జూలై 11 2025న, ITR-5, ITR-6, ITR-7 ఆగస్టులో మాత్రమే విడుదలయ్యాయి. ఇది పన్ను చెల్లింపు దారులకు తగినంత సమయం ఇవ్వలేదు.
చార్టర్డ్ అకౌంటెంట్ రీతు గుప్తా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మేము చార్టర్డ్ అకౌంటెంట్లం, AI కాదని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో అన్ని సమర్థవంతంగా చేయలేమని చెబుతున్నారు. ఈ క్రమంలో గడువును అక్టోబర్ 31, 2025 వరకు పొడిగించాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి కోరుతున్నారు.
గత సంవత్సరంతో పోలిక
గత ఆర్థిక సంవత్సరంలో (2023-24), ఐటీఆర్ ఫారమ్‌లు, యుటిలిటీలు సకాలంలో విడుదలయ్యాయి. ఉదాహరణకు ITR-1 నుంచి ITR-4, ITR-6 ఏప్రిల్ 1, 2024న, ITR-5 మే 31న, ITR-7 జూన్ 21న విడుదలయ్యాయి. దీనివల్ల పన్ను చెల్లింపు దారులకు జూలై 31 గడువు ముందు దాదాపు మూడు నెలల సమయం లభించింది. కానీ ఈ సంవత్సరం, యుటిలిటీలు ఆలస్యంగా విడుదల కావడంతో ఈ సమయం మరింత తగ్గింది.
నిపుణుల అభిప్రాయాలు
SBHS, అసోసియేట్స్ పార్టనర్ హిమాంక్ సింగ్లా ప్రకారం ప్రతి పన్ను సీజన్‌లో రిటర్న్ ఫారమ్‌లు, యుటిలిటీల విడుదల చాలా కీలకం. తగినంత సమయం ఉంటే పన్ను చెల్లింపు దారులు, నిపుణులు ఒత్తిడి లేకుండా ఖచ్చితమైన దాఖలు చేయవచ్చు. ఈ సంవత్సరం ఆలస్యమైన యుటిలిటీల విడుదల వల్ల ఈ ప్రక్రియ కష్టతరంగా మారింది.
దీనిపై చండీగఢ్ చార్టర్డ్ టాక్సేషన్ అసోసియేషన్ (CCATAX) కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT)కు లేఖ రాసి, ఐటీఆర్, ట్యాక్స్ ఆడిట్ గడువులను మరింత పొడిగించాలని కోరింది. గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కూడా యుటిలిటీల ఆలస్య విడుదల, ఫారమ్‌లు అందుబాటులో లేకపోవడం, ఇంటర్నెట్ సమస్యల వల్ల దాఖలు ప్రక్రియ ఒత్తిడిగా మారిందని CBDTకు తెలిపింది.
గడువు పొడిగింపు అవకాశం ఉందా?
ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ నుంచి గడువు పొడిగింపు గురించి అధికారిక ప్రకటన రాలేదు. పన్ను నిపుణులు, సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో CBDT గడువును అక్టోబర్ 31, 2025 వరకు పొడిగించే ఛాన్సుంది. దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి