Share News

Indian Rupee Fall: 64 పైసలు తగ్గి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి విలువ

ABN , Publish Date - Aug 29 , 2025 | 06:23 PM

భారత రూపాయి అమెరికన్ డాలర్‌తో పోల్చితే ఆగస్టు 29న భారీగా పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అమెరికా భారత దిగుమతులపై విధించిన భారీ సుంకాలేనని నిపుణులు చెబుతున్నారు.

Indian Rupee Fall: 64 పైసలు తగ్గి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి విలువ
Indian Rupee Fall

బిజినెస్ డెస్క్: భారత రూపాయి విలువ శుక్రవారం (ఆగస్టు 29న) అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూ.88కి చేరుకుని ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా భారతదేశంపై విధించిన భారీ సుంకాలు ఈ పతనానికి కారణమని నిపుణులు (Indian Rupee Fall) చెబుతున్నారు. ట్రేడింగ్ సమయంలో రూపాయి విలువ 64 పైసలు తగ్గి, ఒక డాలర్‌కు రూ.88.29 స్థాయికి చేరింది.

ఇది ఇప్పటివరకు అత్యంత తక్కువ స్థాయి. అయితే, మధ్యాహ్నం 2:10 గంటల సమయానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయికి కొంత మద్దతు లభించింది. దీంతో రూపాయి విలువ రూ.88.12 వద్ద ట్రేడైంది.


గతంలో కూడా బలహీనం

ఈ ఏడాది ఫిబ్రవరిలో రూపాయి ఒక డాలర్‌కు రూ.87.95 వద్ద ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయిని తాకింది. 2025లో ఇప్పటివరకు రూపాయి విలువ 3% తగ్గింది. దీంతో ఆసియాలో అత్యంత బలహీనమైన కరెన్సీగా రూపాయి మారింది. శుక్రవారం నాడు చైనీస్ యువాన్‌తో రూపాయిని పోలిస్తే రికార్డు కనిష్ఠ స్థాయికి చేరింది. అమెరికా భారత వస్తువులపై విధించిన భారీ సుంకాలు భారత ఆర్థికవృద్ధి, విదేశీ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వారం అమెరికా భారత వస్తువులపై అదనంగా 25% సుంకం విధించింది, దీంతో మొత్తం సుంకం 50%కి చేరింది.

జీడీపీ వృద్ధి తగ్గే అవకాశం

ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ టారిఫ్‌లు ఒక సంవత్సరం కొనసాగితే భారత్ జీడీపీ వృద్ధి 0.6% నుంచి 0.8% వరకు తగ్గే అవకాశం ఉంది. భారత్ అమెరికాకు చేసే ఎగుమతులు మొత్తం జీడీపీలో 2.2%. టారిఫ్‌ల కారణంగా దుస్తులు, జ్యువెలరీ వంటి కార్మిక ఆధారిత రంగాలు ఎక్కువగా నష్టపోతాయి. దీనివల్ల ఉద్యోగాలు తగ్గిపోయి, ఆర్థిక నష్టాలు పెరగవచ్చు.


రూపాయి పడిపోవడం వల్ల..

టారిఫ్‌ల వల్ల ఎగుమతులు తగ్గితే, భారత ట్రేడ్ బ్యాలెన్స్‌పై మరింత ఒత్తిడి పడుతుందని నిపుణులు అంటున్నారు. రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే వస్తువులు ఖరీదవుతాయి. విదేశీ ప్రయాణం, విదేశాల్లో చదువు కూడా ఖరీదవుతుంది. ఉదాహరణకి ఒకప్పుడు డాలర్ విలువ రూ.50 ఉండగా ఇప్పుడు అది రూ.88కి చేరింది. అంటే ఫీజులు, నివాస ఖర్చులు, ఆహారం వంటి అన్ని విషయాల్లో కూడా ఖర్చు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 07:15 PM