Share News

India GDP Growth 2025: ఆర్థిక వృద్ధిలో దూసుకెళ్తోన్న భారత్..తొలి త్రైమాసికంలో 7.8% జంప్

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:26 PM

భారత ఆర్థిక వ్యవస్థ తన బలాన్ని మరోసారి రుజువు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశం అద్భుతమైన 7.8% వృద్ధి రేటును సాధించింది. ప్రపంచ ఆర్థిక సవాళ్ల నడుమ ఈ వృద్ధి నమోదు కావడం విశేషం.

India GDP Growth 2025: ఆర్థిక వృద్ధిలో దూసుకెళ్తోన్న భారత్..తొలి త్రైమాసికంలో 7.8% జంప్
India GDP Growth 2025

మన భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ సత్తా చాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 7.8% ఆర్థిక వృద్ధిని సాధించింది. ఇది నిజంగా గొప్ప విషయం. గత సంవత్సరం ఇదే సమయంలో 6.5% ఉన్న వృద్ధి రేటుతో పోలిస్తే, ఈసారి అంచనాలను మించిపోయామని చెప్పవచ్చు (India GDP Growth 2025). ఈ గణాంకాలను నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) ఆగస్టు 29న విడుదల చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో 6.5 శాతం వృద్ధి నమోదవడంతో పోలిస్తే ఇది ఎంతో మెరుగైన ఫలితంగా చెప్పొచ్చు.


అంచనాలను మించి గ్రోత్

ఈ వృద్ధి రేటు అనలిస్ట్‌లు, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా అంచనా వేసిన 6.5 శాతం కంటే ఎక్కువగా ఉంది. దీని ద్వారా ఇండియా ఆర్థిక వ్యవస్థలో పట్టు పెంచుకుందన్న విషయం స్పష్టమవుతుంది. సేవల రంగం, మానుఫాక్చరింగ్ రంగం బలంగా పనిచేయడం వృద్ధికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

గణాంకాలు ఎలా ఉన్నాయంటే

రియల్ జీడీపీ అంటే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత వచ్చే నిజమైన ఆర్థిక వృద్ధి. ఇది రూ. 47.89 లక్షల కోట్లకు పెరిగింది, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 44.42 లక్షల కోట్లు ఉండేది. అదే సమయంలో నామమాత్రపు జీడీపీ (ద్రవ్యోల్బణంతో కలిపిన మొత్తం విలువ) రూ. 86.05 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో రూ. 79.08 లక్షల కోట్లుగా ఉంది.


బలంగా నిలిచిన వ్యవసాయం

వ్యవసాయ రంగం 3.7 శాతం వృద్ధిని సాధించింది. ఇది గతేడాది ఇదే కాలంలో 1.5 శాతం మాత్రమే ఉంది. గత వృద్ధితో పోలిస్తే ఇది చాలా గొప్ప అభివృద్ధి అని చెప్పవచ్చు. మంచి పంటల దిగుబడి, వర్షాల ప్రభావం, గ్రామీణ ఆదాయం పెరగడం వల్ల వ్యవసాయ వృద్ది పెరిగినట్లు తెలుస్తోంది.

స్థిరంగా మాన్యుఫాక్చరింగ్

మాన్యుఫాక్చరింగ్ రంగం కూడా బాగానే పనిచేసింది. 7.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం త్రైమాసికంలో 7.6 శాతం ఉండేది. ఈ మార్పు తక్కువైనా, స్టేబుల్ ప్రొడక్షన్‌కి ఇది సంకేతంగా చెప్పుకోవచ్చు.


సేవల రంగం కీలక పాత్ర

సేవల రంగం ముఖ్యంగా ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ వంటి విభాగాలు ఈ త్రైమాసిక వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం, టెక్నాలజీ సేవలు విస్తరించడం వల్ల ఈ రంగం చురుగ్గా కొనసాగుతోంది.

చైనా కంటే వేగంగా భారత్

ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. చైనా ఈ కాలంలో కేవలం 5.2 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. ఇదే సమయంలో ఇండియా 7.8 శాతం వృద్ధితో ముందుంది.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 05:34 PM