E20 Petrol Impact: ఈ20 పెట్రోల్ మంచిది కాదా.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:54 PM
చండీగఢ్‌కు చెందిన ప్రముఖ ర్యాలీ డ్రైవర్ రత్తన్ ధిల్లన్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ వల్ల అనేక కార్లకు సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది.
చండీగఢ్‌కు చెందిన ప్రముఖ ర్యాలీ డ్రైవర్ రత్తన్ ధిల్లన్ సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్‌తో హాట్ టాపిక్‌గా మారారు. తన స్నేహితుడి ఖరీదైన ఫెరారీ సూపర్‌కార్‌లో E20 పెట్రోల్ (E20 Petrol Impact) నింపిన కొన్ని రోజులకే ఆ వాహనం స్టార్ట్ కాకుండా నిలిచిపోయిందన్నారు. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన ధిల్లన్, E20 ఇంధనం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఆరోపించాడు. ఈ సంఘటన ఫెరారీ లాంటి లగ్జరీ కార్లకు E20 ఇంధనం సరిపోతుందా అనే చర్చకు తెరలేపింది.
పెట్రోల్ నింపిన తర్వాత
సూపర్ కార్లు, హై-ఎండ్ వాహనాలు ఈ ఇంధన మిశ్రమం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. కానీ ఈ విషయంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదని రత్తన్ ధిల్లన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన స్నేహితుడి ఫెరారీలో ఈ20 పెట్రోల్ నింపిన కొన్ని రోజుల తర్వాత అది స్టార్ట్ కాలేదన్నారు. టెక్నీషియన్లు ఈ సమస్యకు ఈ20 ఇంధనమే కారణమని చెప్పారని వ్యాఖ్యానించారు.
చెల్లించిన తర్వాత
ఇథనాల్ గాలిలోని తేమను గ్రహిస్తుందని, కారు కొన్ని రోజులు ఉపయోగించకపోతే ట్యాంక్‌లో సమస్యలు వస్తున్నాయని ధిల్లాన్ అన్నారు. దీని వల్ల ఇంజన్‌లో దహనం, స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కారు కొని, రోడ్ ట్యాక్స్, వాహన జీఎస్టీ, ఇంధన ట్యాక్స్‌లు చెల్లించిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందన్నారు.
ఈ క్రమంలో కేంద్ర రోడ్ రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ ట్యాగ్ చేసి వెల్లడించారు. ఈ బాధ్యతను గడ్కరీ తీసుకుంటారా అంటూ ప్రశ్నించారు. రతన్ పోస్ట్ వైరల్ కావడంతో ఈ ఇంధనం గురించి నెటిజన్లలో ఆసక్తి నెలకొంది.
కొడుకులకు కూడా..
ఈ విమర్శలకు మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ ఈ20 పెట్రోల్‌పై వచ్చిన ఆరోపణలను రాజకీయ ఉద్దేశంతో చేసిన సోషల్ మీడియా క్యాంపెయిన్‌లు అని విమర్శించారు. ఈ కార్యక్రమం రైతుల ఆదాయాన్ని పెంచడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో విజయవంతమైందన్నారు. తాను ఎలాంటి మోసాలకు పాల్పడబోనని, తన కొడుకులకు కూడా ఈ20 పెట్రోల్ గురించి సూచించానని చెప్పారు.
ప్రభుత్వ వాదనలు
2023లో భారత ప్రభుత్వం ఈ20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఇథనాల్ మిశ్రమ ఇంధనం కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని, ఇంజన్ పనితీరును మెరుగుపరుస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఐదేళ్ల ముందుగానే సాధించినప్పటికీ, వాహనాల మైలేజీ తగ్గడం, ఇంజన్ దెబ్బతినే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి