India Growth Forecast: జీఎస్టీ బూస్ట్..భారత్ వృద్ధి అంచనాలను పెంచిన రేటింగ్ సంస్థలు, సాధ్యమేనా
ABN , Publish Date - Sep 24 , 2025 | 08:30 AM
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణలు, ఆర్థిక, ద్రవ్య విధానాల్లో వచ్చిన సడలింపులు వృద్ధికి మరింత బలం చేకూర్చుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత ఆర్థిక వ్యవస్థకు ఇటీవల కొత్త జీఎస్టీ (GST) సంస్కరణలు, ఆర్థిక, ద్రవ్య విధానాల సడలింపు దేశ వృద్ధి (India Growth Forecast) అంచనాలను ఊపందుకునేలా చేస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరం (FY26) వృద్ధి అంచనాను 40 బేసిస్ పాయింట్లు (bps) పెంచి 6.7%గా నిర్ణయించింది. దీని వెనుక GSTలో కోతలు, ఆదాయపు పన్ను సడలింపు, ప్రభుత్వ పెట్టుబడుల వేగవంతం కీలక కారణాలుగా ఉన్నాయి. కానీ అధిక సుంకం రేట్లు ఎగుమతి రంగంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని OECD ప్రస్తావించింది.
ప్రభుత్వ పెట్టుబడుల వేగం
మరోవైపు ప్రపంచ క్రెడిట్ రేటింగ్ సంస్థ S&P గ్లోబల్ భారత FY26 వృద్ధి అంచనాను 6.5% వద్ద స్థిరంగా ఉంచింది. దేశీయ డిమాండ్ బలంగా కొనసాగుతుందని, అనుకూలమైన రుతుపవనాలు, ఆదాయపు పన్ను, GST కోతలు, ప్రభుత్వ పెట్టుబడుల వేగం దీనికి ఊతమిస్తాయని S&P తెలిపింది.
దేశంలో అధిక సుంకం రేట్లు ఎగుమతి రంగంపై ఒత్తిడి తెస్తాయి. కానీ కొత్త జీఎస్టీ సంస్కరణలతో ద్రవ్య ఆర్థిక విధానం సపోర్ట్ చేస్తుందని OECD తన నివేదికలో తెలిపింది. అయితే, 2026-27 ఆర్థిక సంవత్సరం (FY27) కోసం OECD అంచనాను 20 bps తగ్గించి 6.2%కి నిర్ణయించింది. ఇది కొంత జాగ్రత్తను సూచిస్తుంది.
ప్రపంచ ఆర్థిక విధానం
OECD ప్రకారం, 2025 మొదటి భాగంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3.2%కి చేరుతుంది. ఇది జూన్ అంచనా కంటే 30 bps ఎక్కువ. ఈ వృద్ధి వెనుక అమెరికా, జపాన్‌లలో అధిక సాంకేతిక రంగాలలో బలమైన పెట్టుబడులు, G20 ఆర్థిక వ్యవస్థలలో పారిశ్రామిక ఉత్పత్తి 2024 స్థాయిలను మించడం వంటి కారణాలు ఉన్నాయి.
అయితే, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ వంటి ప్రాంతాలలో ప్రైవేట్ వినియోగ వృద్ధి బలహీనపడింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో కొన్ని ఊహించని వృద్ధిని సాధించాయి. కానీ బ్రెజిల్లో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగడం, భారతదేశంలో జీడీపీ డిఫ్లేటర్ తగ్గడం వంటి తాత్కాలిక కారణాలు దీనికి దోహదపడ్డాయి.
ద్రవ్యోల్బణం
భారతదేశంలో ద్రవ్యోల్బణం FY26లో 2.9%కి తగ్గుతుందని OECD అంచనా వేసింది. ఇది గతంలో అంచనా వేసిన 4.1% కంటే తక్కువ. FY27లో కూడా ఇది 3% సమీపంలోనే ఉంటుందని తెలిపింది. ఆహార ధరల ద్రవ్యోల్బణం తగ్గడం, బలమైన దేశీయ సరఫరా, ఎగుమతి ఆంక్షలు దీనికి కారణాలుగా ఉన్నాయి. S&P కూడా భారత ద్రవ్యోల్బణ అంచనాను 3.2%కి తగ్గించింది. మొత్తంగా GST సంస్కరణలు, ద్రవ్య విధాన సడలింపు, ప్రభుత్వ పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని నివేదికలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి