Balakrishna NSE: ముంబయి NSEలో గంటా మోగించిన బాలకృష్ణ..సౌత్ నుంచి గౌరవం దక్కిన తొలి హీరో
ABN , Publish Date - Sep 09 , 2025 | 08:15 AM
టాలీవుడ్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబయిలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నుంచి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం దక్కింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
టాలీవుడ్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య పేరు వినగానే అనేక మందికి పెద్ద పెద్ద డైలాగులు, స్క్రీన్‌పై ఉర్రూతలూగించే యాక్షన్ సీన్స్ గుర్తుకొస్తాయి. కానీ, ఆయన సినిమా జీవితం ఒకవైపు అయితే, సమాజ సేవలో ఆయన చేస్తున్న కృషి అనేక మందిని ఆకట్టుకుంటోంది. ఇటీవల కాలంలో సామాజిక సేవల్లో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆయన దేశవ్యాప్తంగా వేలాది మందికి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడే వారికి ఈ హాస్పిటల్ ఒక వరం లాంటిది. సినిమాల షూటింగ్‌లు, రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నా, ఈ సేవా కార్యక్రమాలకు ఆయన ఎప్పుడూ సమయం కేటాయిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఆయన సేవలను గుర్తించి సన్మానించింది. సినిమా, రాజకీయం, సామాజిక సేవ మూడు రంగాల్లోనూ బాలయ్య గారు తనదైన ముద్ర వేస్తున్నారు. ఓవైపు సినిమాల్లో ఆయన అభిమానులకు ఆనందాన్ని పంచుతూ, మరోవైపు సమాజానికి సేవ చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ముంబయి (Mumbai) నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నుంచి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. బసవతారకం హాస్పిటల్ ప్రముఖులతో కలిసి ఆయన సోమవారం NSEని సందర్శించారు. అక్కడ ఆయనకు NSEలో ట్రేడింగ్ బెల్ కొట్టే గౌరవం దక్కింది. ఈ గంట కొట్టడం అంటే మాములు విషయం కాదు. దేశంలోని అతిపెద్ద స్టాక్ మార్కెట్ సంస్థలో ప్రత్యేక సందర్భాల్లో, ప్రముఖులకు మాత్రమే ఈ అవకాశం ఇస్తారు. ఈ గౌరవం అందుకున్న తొలి దక్షిణ భారత నటుడిగా బాలయ్య కావడం విశేషం.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి