Amazon FTC Settlement: అమెజాన్‌కు భారీ జరిమానా.. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ వివాదంపై FTCతో $2.5 బిలియన్ సెటిల్‌మెంట్
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:53 PM
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్ తాజాగా అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC)తో జరిగిన కేసులో $2.5 బిలియన్లు (రూ. 22,178 కోట్లు) సెటిల్‌మెంట్ చేసేందుకు అంగీకరించింది. అసలు ఏం జరిగింది, ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ (Amazon), ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ. తన ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ సేవలపై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) ఆరోపణలను పరిష్కరించడానికి ఏకంగా $2.5 బిలియన్ (రూ. 22,178 కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది. ఈ సెటిల్‌మెంట్‌లో $1 బిలియన్ జరిమానాగా, $1.5 బిలియన్ కస్టమర్లకు రీఫండ్‌ల రూపంలో చెల్లించబడుతుంది.
కస్టమర్లను తప్పుదారి పట్టించే విధంగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లలో చేర్చడం, ఆ తర్వాత వాటిని రద్దు చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయని అనేక మంది FTCకి ఫిర్యాదు చేశారు. FTC, యాంటీ ట్రస్ట్, కన్స్యూమర్ ప్రొటెక్షన్‌ను పర్యవేక్షించే సంస్థ. ఆ క్రమంలో 2023లో అమెజాన్, దాని ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లపై కేసు దాఖలు చేసింది. అమెజాన్ తన కస్టమర్లను 2010లో ఆన్‌లైన్ షాపర్ల రక్షణ కోసం రూపొందించిన చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ప్రవర్తించిందని FTC ఆరోపించింది.
FTC ప్రకారం లక్షలాది కస్టమర్లు తెలియకుండానే ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో చేరారు. దీంతోపాటు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రద్దు ప్రక్రియ అమెజాన్‌లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో కస్టమర్లను రద్దు చేయకుండా నిరోధించేలా, తప్పుదారి పట్టించేలా రూపొందించబడిందని FTC ఆరోపించింది. ఇది కస్టమర్లను గందరగోళానికి గురిచేస్తుందని తెలిపింది.
దీనిపై అమెజాన్ సెటిల్ చేసుకునేందుకు సిద్ధం కాగా, దీనిని FTC చారిత్రాత్మకంగా అభివర్ణించింది. ఇది 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది. దీంతోపాటు అమెజాన్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు, నీల్ లిండ్‌సే, జమీల్ ఘనీ, ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లకు సంబంధించి మోసపూరిత పద్ధతుల్లో పాల్గొనకుండా నిషేధించబడ్డారు. మూడో ఎగ్జిక్యూటివ్ రస్సెల్ గ్రాండినెట్టి ఈ కేసు నుంచి తప్పించబడ్డారు.
దీనిపై అమెజాన్ ప్రతినిధి మార్క్ బ్లాఫ్కిన్ స్పందించారు. అమెజాన్, మా ఎగ్జిక్యూటివ్‌లు ఎల్లప్పుడూ చట్టాన్ని అనుసరించారని తెలిపారు. కానీ ఈ సెటిల్‌మెంట్ మేము ముందుకు సాగడానికి, కస్టమర్లకు మరింత సేవలు అందించేందుకు అవకాశం ఇస్తుందని తెలిపింది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర అమెరికాలో సంవత్సరానికి $139 లేదా నెలకు $15. ఈ సెటిల్‌మెంట్‌లో భాగంగా, అమెజాన్ కస్టమర్లకు గరిష్టంగా $51 వరకు రీఫండ్‌లు అందించబడతాయి. అమెజాన్ తన ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రద్దు ప్రక్రియను సులభతరం చేసేందుకు కూడా అంగీకరించింది. తద్వారా కస్టమర్లు సులభంగా రద్దు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి