Share News

Ananthapuram News: ఏంటప్పా.. ఈ రప్పా.. రప్పా..?

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:36 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సం ఇంకా గ్రామాల్లో అలజడి రేపుతూనే ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కాస్త దెబ్బతింటోంది. అంతేగాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Ananthapuram News: ఏంటప్పా.. ఈ రప్పా.. రప్పా..?

- ఆగని వైసీపీ నేతల రుబాబు, అల్లరి

- అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్డుపై ధర్నా

- ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఆందోళనలు

- తప్పుబట్టిన పోలీసులతో దురుసు ప్రవర్తన

- 23 మందితోపాటు మరికొందరిపై కేసులు

- అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ఇదే తీరు

అనంతపురం: అధికారంలో ఉన్నా లేకున్నా రుబాబు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారింది. అనుమతి లేకుండా ఆందోళనలు చేయడం, పోలీసులపై దుందుడుకుగా వ్యవహరించడం, తోపులాటకు దిగడం సర్వసాధారణం అయ్యింది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు మరింతగా తెగబడి, అల్లరి చేస్తున్నారు. రెండు రోజుల కిందట అనంతపురం టూ టౌన్‌ పోలీస్టేషన్‌ వద్ద జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ.


ప్రజలు ఇబ్బంది పడేలా..

అనంతపురంలో కోర్టు రోడ్డు ప్రధానమైంది. ఇక్కడ ఒకవైపు జిల్లా కోర్టు, మరోవైపు రెండో పట్టణ పోలీస్టేషన్‌, అనంతపురం రూరల్‌ పోలీస్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ ఉన్నాయి. పలు కళాశాలలు, ప్రభుత్వాసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి ఇది. నిత్యం వేలాది మంది అటు, ఇటు రాకపోకలు సాగిస్తుంటారు. పైగా సాయంత్రం. ఈ సమయంలో వైసీపీ నేతలు తమ కార్యకర్తలను, కార్పొరేటర్‌ కొడుకును స్టేషన్‌కు తీసుకొచ్చారంటూ ఆందోళనకు దిగారు. ఎలాంటి అనుమతి లేకుండానే మాజీ ఎమ్మెల్యే ఇంటి నుంచీ ర్యాలీగా వందలాది మంది వచ్చి, టూ టౌన్‌ వద్ద ఆందోళనకు దిగారు.


pandu1.3.jpg

నడిరోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిరసన ఏంటని త్రీటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌, టూ టౌన్‌ సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌ వారిని ప్రశ్నించారు. దీంతో కొందరు వైసీపీ నాయకులు రెచ్చిపోయి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టూటౌన్‌ పోలీస్ స్టేషన్‌ వద్ద నీకేం పని అని త్రీటౌన్‌ సీఐతో వాగ్వాదానికి దిగారు. ఆందోళన విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు, ఐదుగురు సీఐలు అక్కడికి చేరుకుని అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ మూకలపై చర్యలకు దిగారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ వ్యవహరించిన నాయకులపై కేసులు నమోదు చేశారు.


pandu1.4.jpg

స్థానిక ఎన్నికలు సమీపించే వేళ...

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైసీపీ నాయకుల రుబాబు రాజకీయం మరింత పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ నాయకులకు ప్రధానమైన అంశం ఏదీ దొరకడం లేదు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలతోపాటు, ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తూ ప్రజల్లో సానుకూలత ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు, ప్రజలు, అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జగన్‌ జన్మదినం సందర్భంగా మూగజీవాలను బలి ఇవ్వడం, జగన్‌ పోస్టర్లకు రక్తాభిషేకం చేయడం, వేటకొడవళ్లు చేతబట్టి రప్పా..రప్పా అంటూ కేకలు వేయడం ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించింది.


చర్యలు తప్పవ్‌: శ్రీనివాసరావు, డీఎస్పీ, అనంతపురం

ప్రజలకు అసౌక్యం కలిగించిన వారు ఎవరైనా చర్యలు తీసుకుంటాం. పోలీసుశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేయడం సబబుకాదు. ఇటీవల జాతీయ రహదారిపై ఆం దోళన చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై కూడా కేసులు నమోదు చేశాం. కోర్టు రోడ్డులో కూడా రూల్స్‌ బ్రేక్‌ చేసి ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేశాం. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసినా, ప్రజలు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.


అధికారంలో ఉండగా..

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 2023 ఆగస్టు 9న మద్యం అమ్ముతున్న వైసీపీ నేత అనుచరులను అనంతపురం ఎక్సైజ్‌ పోలీసులు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు దండును వేసుకుని స్టేషన్‌పై దండెత్తారు. మహిళా కానిస్టేబుల్‌పై స్టేషన్‌లోనే దాడికి దిగారు. దీనిపై అప్పటి ఎక్సైజ్‌ పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా టూ టౌన్‌ వద్ద కూడా పోలీసులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు.


23 మందిపై కేసులు...

ప్రజలకు అసౌకర్యం కలిగించి, పోలీసులపై దౌర్జన్యం చేయడానికి దిగిన వైసీపీ నాయకులు 23 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే తమ్ముడు అనంత చంద్రారెడ్డి, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతీ, సాకే చంద్ర, రమేష్‌ గౌడ్‌, ఓబులేసు, దాదా ఖలందర్‌, ఇగ్గుల శ్రీనివాసులు, చాకల శ్రీనివాసులు, రహంతుల్లా, లక్ష్మీనగర్‌ మధు, శ్రీదేవి, కైలాష్‌, సోమశేఖర్‌రెడ్డి, సాదిక్‌, ముంతాజ్‌ బేగం, రాధాకృష్ణ, సైఫుల్లా బేగ్‌, ఖాజా, నరసింహులు, ఆసిఫ్‌, రామచంద్ర వినీత్‌పై కేసులు కట్టారు. వీరితోపాటు మరికొందరిపై కేసులు కట్టారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

2న మళ్లీ సభకు వస్తారా?

గర్భధారణ 30 ఏళ్లలోపే...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 30 , 2025 | 11:36 AM