YSRCP Corruption: పిల్లల కిట్లలోనూ కొట్టేశారు
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:55 AM
బడి పిల్లలకు ఇచ్చే స్టూడెంట్ కిట్లనూ గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు వదిలిపెట్టలేదు. చిన్న పిల్లలకు ఇచ్చిన బ్యాగులు, బెల్టుల్లోనూ ‘మాకేంటి’ అంటూ చేతివాటం ప్రదర్శించారు.

నాటి వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు దోపిడీ
కమీషన్ల కోసం అదనపు ధరలకు కాంట్రాక్టులు
గతేడాదితో పోలిస్తే ఇప్పుడు 64 కోట్లు ఆదా
ప్రభుత్వంపై తగ్గిన భారం 9.44 శాతం
ఈ లెక్కన గత ఐదేళ్లలో దోపిడీ 300 కోట్లపైనే
బూట్లు, బెల్టులు, బ్యాగులు అన్నీ ఎక్కువ రేట్లకే
ఒక్క నోట్ పుస్తకాల్లోనే 36.5 శాతం వ్యత్యాసం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మద్యంలో కమీషన్లు దండుకున్నారు. గనుల లీజుల్లో వాటాలు దక్కించుకున్నారు. ఇవన్నీ ఒకెత్తు! చివరికి బడి పిల్లలకు ఇచ్చే స్టూడెంట్ కిట్లనూ గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు వదిలిపెట్టలేదు. చిన్న పిల్లలకు ఇచ్చిన బ్యాగులు, బెల్టుల్లోనూ ‘మాకేంటి’ అంటూ చేతివాటం ప్రదర్శించారు. ఐదేళ్లలో రూ.300 కోట్లకు పైగా దోపిడీ చేశారు. విద్యార్థుల కిట్ల(జగనన్న విద్యా కానుక) కొనుగోలులో అత్యంత పారదర్శకత పాటించామని అప్పటి ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేయగా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన తొలి కిట్ల కొనుగోలుతో అసలు విషయం బయటపడింది. గతంలో ఇచ్చిన వాటితో పోలిస్తే కిట్లలో కొంతమేర నాణ్యత పెంచినా అనూహ్యంగా ధర 9.44శాతం తగ్గిపోయింది. ఫలితంగా రూ.63.79 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. 35.94 లక్షల కిట్ల కొనుగోలులోనే ఇంత వ్యత్యాసం వస్తే... గత ప్రభుత్వం 45లక్షల వరకు కిట్లు కొనుగోలు చేయగా, అప్పట్లో ఇంకెంత మేర అప్పనంగా చెల్లించారో అర్థమవుతోంది.
పారదర్శకంగా టెండర్ల విధానం
గత ప్రభుత్వం విద్యాకానుక టెండర్లను ఇష్టారాజ్యంగా మార్చడంతో ఈ ఏడాది ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంట్రాక్టర్లతో దశలవారీగా చర్చలు జరిపి పారదర్శకమైన ధరలతో టెండర్లు నిర్వహించేలా చూసింది. ముఖ్యంగా ‘ఎవరికీ కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అనే మాట బాగా పనిచేసింది. వాస్తవంగా కిట్ల ఉత్పత్తికి అయ్యే ఖర్చు మాత్రమే కాంట్రాక్టర్లు కోట్ చేశారు. గతంలో కమీషన్లు సమర్పించుకోవాల్సి రావడంతో అవి కూడా కలిపి లెక్కలేసుకున్న తర్వాత అదనపు ధరలకు కోట్ చేసేవారు. ఈసారి కమీషన్ల బెడద లేకపోవడంతో వాస్తవ ఉత్పత్తి ధరపై కొంత లాభం చూసుకుని కిట్లు సరఫరా చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్‌లో విద్యార్థులకు బ్యాగులు, బూట్లు, బెల్టులు, యూనిఫాం క్లాత్, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఇస్తారు. పాఠ్యపుస్తకాల టెండర్లను పాఠశాల విద్యాశాఖ విడిగా చేపడుతోంది. మిగిలిన వస్తువులకు టెండర్లు సమగ్రశిక్ష పిలిచింది. కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెంచడం, సకాలంలో కిట్లు అందేలా చూడటం కోసం ఎక్కువ మంది కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. గతేడాది 16 మంది వెండర్లు కిట్లు సరఫరా చేయగా, ఈ ఏడాది 27 మంది ఎంపికయ్యారు. వీరిలో మొత్తం 138 కంపెనీలు టెండర్లలో పాల్గొనగా, 114 కంపెనీలు అర్హత సాధించాయి. అందులో 27 కంపెనీలు ఎల్1గా నిలిచాయి. ఆ కంపెనీల్లో 9 కంపెనీలు కొత్తగా వచ్చాయి.
ధరల్లో వ్యత్యాసం ఇలా....
2024-25 విద్యా సంవత్సరానికి ఎలాంటి టెండర్లు లేకుండానే అప్పటి వైసీపీ ప్రభుత్వం పాత కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఆ ఏడాదికి 35.94లక్షల కిట్లు కొనుగోలు చేయగా, వచ్చే విద్యా సంవత్సరానికి కూడా అంతే సంఖ్యలో కిట్లు కొనుగోలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక్కో బెల్టుకు రూ.34.5 ధర చెల్లించగా, ఇప్పుడు రూ.24.93కే సరఫరా చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. నోట్ పుస్తకానికి అప్పట్లో రూ.52 చెల్లించగా ఇప్పుడు ఏకంగా 36.5శాతం ధర తగ్గి, రూ.35.64కే రానుంది. బ్యాగును వైసీపీ ప్రభుత్వం రూ.272.92 ధరతో కొనుగోలు చేయగా, అదే బ్యాగును ఇప్పుడు రూ.250కు ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. బూట్లకు అప్పుడు రూ.187.48 చెల్లించగా, ఇప్పుడు రూ.159.09 ధర ఖరారైంది. యూనిఫాం క్లాత్ ఒక్కో విద్యార్థికి మూడు జతలకు గతంలో ధర రూ.1081.98 అయితే, ఇప్పుడు రూ.1061.43గా నిర్ణయించారు. పైగా ఈసారి యూనిఫాం క్లాత్ డిజైన్ మార్చడంతో పాటు మరింత నాణ్యమైన క్లాత్‌ను ఎంపిక చేశారు. నాణ్యత పెరిగినా ధర తగ్గడాన్ని బట్టి గత పాలకులు ఎలా దోపిడీ చేశారో గ్రహించిన విద్యాశాఖ వర్గాలు అవాక్కవుతున్నాయి. ఇవే కిట్లను గత ప్రభుత్వం రూ.676.12 కోట్లతో కొనుగోలు చేయగా, కూటమి ప్రభుత్వం రూ.612.32 కోట్లు మాత్రమే వెచ్చించింది.
గత జగన్ ప్రభుత్వంలో విద్యా కానుకలో కమీషన్ల భయం కాంట్రాక్టర్లను వెంటాడింది. ఏటా దాదాపు రూ.వెయ్యి కోట్ల టెండర్లు కావడంతో అందులో రాజకీయ జోక్యం భారీగా ఉండేది. ఏటా కొన్ని కంపెనీలకే ఉద్దేశపూర్వకంగా టెండర్లు కట్టబెట్టారు. కొత్త కంపెనీలు రాకుండా అలవికాని నిబంధనలు విధించారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు ఇష్టమైన కంపెనీలు మాత్రమే ఎంపికై, ధరల విషయంలో ఎప్పుడూ పోటీ కనిపించలేదు. ఈసారి అందరికీ అవకాశం ఇవ్వడంతో కంపెనీలు పోటీపడి తక్కువకు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇక 2024-25 విద్యా సంవత్సరానికి అయితే అసలు టెండర్లే లేకుండా కాంట్రాక్టు కట్టబెట్టారు. రూ.700 కోట్ల కాంట్రాక్టును నామినేషన్ విధానంలో ఇచ్చేశారు. అలాగే మొదటి ఏడాది టెండర్లను జ్యుడీషియల్ కమిషన్ పరిశీలనకు పంపగా, ఆ తర్వాత జ్యుడీషియల్ కమిషన్‌ను తప్పించి నేరుగా కట్టబెట్టారు. చివరికి చిన్న ప్రింటర్లను కూడా పిలిపించుకుని పాఠ్యపుస్తకాలకు కమీషన్లు డిమాండ్ చేశారు.
క్యూసీఐతో నాణ్యత పరిశీలన
‘‘పలుమార్లు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి సకాలంలో బిల్లులు చెల్లిస్తామనే హామీ ఇచ్చాం. ఈసారి యూనిఫాం క్లాత్ నాణ్యత పెరిగింది. కిట్ల సరఫరాలో జాప్యం లేకుండా చేసేందుకు ఎక్కువ ప్యాకేజీలతో టెండర్లు పిలిచాం. మొత్తం 27 ప్యాకేజీల్లో 9 కంపెనీలు కొత్తగా వచ్చాయి. ఎక్కువ ప్యాకేజీలు పెట్టడం వల్ల కొత్తవారు రావడానికి అవకాశం ఏర్పడింది. అలాగే కిట్ల నాణ్యతను క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పరిశీలన జరిపిస్తాం. ఉత్పత్తి చేసిన ప్రాంతంతోపాటు డెలివరీ చేసిన ప్రాంతంలో కూడా నాణ్యత పరిశీలన చేస్తాం. నాణ్యతలో ఎక్కడా రాజీ ఉండదు. 9.44 శాతం నిధులు ఆదా అయ్యాయి’’
- బి.శ్రీనివాసరావు, సమగ్రశిక్ష ఎస్పీడీ