Share News

YCP Misconduct : తనిఖీలు తుస్సు!

ABN , Publish Date - Jan 04 , 2025 | 06:32 AM

ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటి స్థలాల చదును పనుల తనిఖీలను నిర్వీర్యం చేసేందుకు కొంత మంది అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

YCP Misconduct : తనిఖీలు తుస్సు!

  • గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల చదును అక్రమాలపై అధికారుల నిర్లక్ష్యం

  • యథేచ్ఛగా మార్గదర్శకాల ఉల్లంఘన

  • అక్రమార్కులను రక్షించేందుకు యత్నాలు

  • బకాయి సొమ్ము ఇప్పించేలా పావులు

  • తనిఖీల్లో మమ అనిపించేలా అన్ని జిల్లాల ‘ఉపాధి’ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు

  • మళ్లీ తనిఖీలు చేస్తాం.. కమిషనర్‌ హెచ్చరిక

అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటి స్థలాల చదును పనుల తనిఖీలను నిర్వీర్యం చేసేందుకు కొంత మంది అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తనిఖీల కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఇచ్చిన మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లు, అప్పటి అధికారులను రక్షిస్తున్నారు. విత్‌హెల్డ్‌లో ఉన్న 25 శాతం పెండింగ్‌ బిల్లుల్లో 5 శాతం రికవరీ పెట్టి, మిగిలిన 20 శాతం కాంట్రాక్టర్లకు ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు. పైగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉపాధి సిబ్బందినే తనిఖీలకు వినియోగించడంతో.. విచారణ తప్పుదారి పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కమిషనర్‌ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోకుండా తనిఖీలను మమ అనిపించే ధోరణిలో అన్ని జిల్లాల క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ప్రభుత్వ భూముల్లో మట్టి సేకరించి..

అప్పట్లో జగనన్న కాలనీలో ఇంటి చదును పనుల్లో మట్టి కొనుగోలు కోసం క్యూబిక్‌ మీటర్‌కు రూ.50 రికార్డు చేసి చెల్లించారు. వాస్తవానికి మట్టిని రైతుల నుంచి కొనుగోలు చేసి ఉంటే రూ.50 చెల్లించాలి. అయితే రైతు పొలం నుంచి మట్టి తీసుకునేందుకు తహసీల్దార్‌ అనుమతి ఉండాలి. ఆ మేరకు రికార్డులు సమర్పించాలి. ప్రభుత్వ స్థలంలో మట్టి సేకరిస్తే, క్యూబిక్‌ మీటర్‌కు రూ.50 చెల్లించే అవసరం ఉండదు. అయితే చదును పనులకు మట్టిని క్యూబిక్‌ మీటర్‌కు రూ.50 చెల్లించి కొనుగోలు చేసినట్లు, తరలించినందుకు రూ.80 చొప్పున మొత్తంగా క్యూబిక్‌ మీటర్‌కు రూ.134 చొప్పున రికార్డు చేశారు. రైతుల నుంచి సేకరించకుండానే ప్రభుత్వ భూముల్లో మట్టిని సేకరించి, క్యూబిక్‌ మీటర్‌కు రూ.50 అదనంగా వసూలు చేశారు.


దీంతో ప్రభుత్వ సొమ్ము భారీగా వైసీపీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లింది. కమిషనర్‌ ఆదేశాల ప్రకారం ఆయా పనులకు సంబంధించిన రికార్డులు పరిశీలించి, మట్టి కొనుగోలుకు తహసీల్దార్ల అనుమతి ఉందా? అనేది పరిశీలించాలి. అనుమతి లేని పనుల్లో రూ.50 కోత విధించాలి. ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయాలని కమిషనర్‌ సూచించారు. ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరమైతే తాజా కొలతలను అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేశారు.

లెవెలింగ్‌ పనులు చేశారా? లేదా?

గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.1,125 కోట్ల మేర పనులు వైసీపీ కార్యకర్తల ద్వారా చేపట్టారు. అయితే రూ.1,500 కోట్ల పనులు చేసినట్లు దొంగ బిల్లులు పెట్టారు. రూ.1,260 కోట్ల మేర గత ప్రభుత్వం ఎన్నికల ముందే చెల్లించింది. ఇక సుమారు రూ.240 కోట్ల మేర బకాయిలున్నాయని పనులు చేసిన వాళ్లు హైకోర్టును ఆశ్రయించగా.. వారికి బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అయితే విత్‌హెల్డ్‌లో ఉన్న బకాయిలు చెల్లించడానికి క్వాలిటీ కంట్రోల్‌, సోషల్‌ ఆడిట్‌ విభాగాలు తనిఖీలు చేపట్టాల్సి ఉందని అప్పట్లోనే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటి స్థలాల లెవలింగ్‌ పనుల్లో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యేలు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తారు. దీంతో కమిషనర్‌ కృష్ణతేజ ఇంటి స్థలాల చదును పనులను తనిఖీ చేయాలని తాజాగా ఆదేశాలిచ్చారు. అన్ని జిల్లాల్లో పంచాయతీరాజ్‌, ఇతర శాఖల ఇంజనీర్లతో బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. పనుల వాస్తవ పరిస్థితి, లెవలింగ్‌ పనులు చేశారా? లేదా? నమోదిత పరిమాణంలో పనులున్నాయా? లేదా? అనే అంశాలను పరిశీలించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మట్టి కొన్నట్లు దొంగ రికార్డులు సృష్టించారా? తహసీల్దార్‌ అనుమతి లేకుండానే క్యూబిక్‌ మీటర్‌ మట్టికి రూ.50 అదనంగా రికార్డు చేసి సొమ్ము స్వాహా చేశారా? తదితర అంశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. అయితే ఆ మార్గదర్శకాలను అధికారులు పట్టించుకోకపోవడంతో తనిఖీలు తప్పుదారి పట్టాయి.


తనిఖీల నిర్వీర్యానికి యత్నాలు

తనిఖీలను కొంత మంది అధికారులు కావాలని నిర్వీర్యం చేస్తున్నారు. అప్పట్లో పనిచేసిన అధికారులు బాధ్యులవుతారన్న భయంతో కొంత మంది తనిఖీలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కమిషనరేట్‌ స్థాయిలోనూ జిల్లాలకు ఎప్పటికప్పుడు అలెర్ట్‌ చేయడంలో నిరక్ష్యం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు సాయం చేసేందుకు, అప్పట్లో పనిచేసిన అధికారులతో అంటకాగుతున్న కొంత మంది అధికారులు.. తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి, వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కమిషనర్‌ ఒక విధంగా ఆదేశిస్తే.. జిల్లాలకు మరో విధంగా సమాచారం చేరవేస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు జిల్లాల్లో ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటున్నారు. తనిఖీల్లో నిర్ధిష్టమైన మార్గదర్శకాలను అనుసరించకపోవడంతో ఈ తనిఖీలు తుస్సుమనే ప్రమాదముందనే వాదన వినిపిస్తోంది.

అధికారులకు కమిషనర్‌ హెచ్చరిక

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే 200కు పైగా పనులు తనిఖీ చేశామని, ఆ పనుల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేవని శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ జిల్లా పీడీ తెలియజేయడంతో కమిషనర్‌ కృష్ణతేజ మండిపడ్డారు. ఇంతలోనే అన్ని పనులు ఎలా చేశారని, వాటిపై మళ్లీ తనిఖీలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటి స్థలాల లెవలింగ్‌ పనుల తనిఽఖీల విషయంలో నిర్లక్ష్యం చేస్తే మళ్లీ తనిఖీలు చేపడతామన్నారు. తప్పు చేసినట్లు నిరూపణ అయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లోనూ ఇంటి స్థలాల లెవలింగ్‌ పనుల తనిఖీల్లో నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయన్నారు.


కాంట్రాక్టర్లతో పర్సంటేజీ బేరాలు

తనిఖీల కోసం కమిటీలు వేయాలని కమిషనర్‌ గత నెల 3వ తేదీన అన్ని జిల్లాలకు సూచించారు. కొన్ని జిల్లాల్లో క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు ఉపాధి సిబ్బందినే తనిఖీల కోసం సిఫారసు చేశారు. గతంలో ఆ పనులు పర్యవేక్షించి, సూపర్‌ చెక్‌ చేసిన ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌లను తనిఖీలు చేయాలని ఆదేశాలివ్వడంతో సీరియ్‌సనెస్‌ తగ్గింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తనిఖీలు మమ అనిపించే ప్రయత్నాలు చేశారు. గతంలో బకాయిలు 25 శాతం పెండింగ్‌ ఉంటే.. 5 శాతం తేడాలున్నట్లు చూపించి, మరో 20 శాతం బకాయిలను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొన్ని జిల్లాల్లో సిబ్బంది కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసి.. పనుల తనిఖీల్లో సాయం చేస్తామని, వారి నుంచి కమీషన్లు వసూలు చేసుకోసాగారు.

Updated Date - Jan 04 , 2025 | 06:32 AM