Share News

Stray Dogs Attack On People: పిచ్చి కుక్కల దాడి.. ఆసుపత్రిలో వైద్యమందక రోగులు అవస్థలు..

ABN , Publish Date - Jul 06 , 2025 | 06:00 PM

ఉభయ గోదావరి జిల్లాల్లో పిచ్చకుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలపై దాడి చేసి కరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు బాధితులుగా మారుతున్నారు.

Stray Dogs Attack On People: పిచ్చి కుక్కల దాడి.. ఆసుపత్రిలో వైద్యమందక రోగులు అవస్థలు..

అమలాపురం/ ఏలూరు, జులై 06: ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఆ క్రమంలో 22 మందిపై దాడి చేసి... కరిచాయి. దీంతో బాధితులను కాట్రేనికోన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారికి మెరుగైన వైద్య సహాయం కోసం అమలాపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వారంతా ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పిచ్చి కుక్కల బెడద అధికంగా ఉందని చెబుతున్నారు. వీటిపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్క దాడి ఘటనలు చోటు చేసుకున్నా.. అధికారులు మాత్రం స్పందించడం లేదని వారు వివరిస్తున్నారు.


మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం జిలుగుమిల్లిలో పలువురిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. దీంతో వారు సమీపంలోని ఆసుపత్రికి వెళ్లారు. కానీ వారికి సరైన వైద్య సహాయం అందలేదు. దీంతో వారిని కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సైతం వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. ఆసుపత్రికి వచ్చి గంటలు గడుస్తున్నా.. సిబ్బంది మాత్రం అందుబాటులో లేకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.


ఇక ఈ వ్యవహారాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి బాధిత కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగి.. కుక్క కాటుతో ఆసుపత్రిలో చేరిన బాధితులకు చికిత్స అందించాలని ఆదేశించారు. అయితే బాధితులే స్వయంగా సబ్బులు కొనుగోలు చేసుకుని మరీ గాయపడిన ప్రదేశాన్ని శుభ్రం చేసుకున్నారు. ఆ తర్వాత మాత్రమే స్టాఫ్ నర్సులు వారికి వైద్యం అందించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తొలి ఏకాదశి.. ఉజ్జయిని మహాకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

క్యాన్సర్‌ కణాలను నియంత్రించే సింపుల్ చిట్కా..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 07:16 PM