Kakinada: నర్సుపై కత్తులతో ఆగంతకుల దాడి.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Dec 11 , 2025 | 09:20 AM
కాకినాడ జిల్లా పిఠాపురంలో అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ నర్సుపై కొందరు ఆగంతకులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
కాకినాడ జిల్లా, డిసెంబర్ 11: జిల్లాలోని పిఠాపురంలో అర్ధరాత్రి నడిరోడ్డులో ఓ మహిళపై కత్తులతో దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విధులు ముగించుకుని వెళ్తున్న నర్సుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో నర్సు తీవ్రంగా గాయపడింది. సదరు బాధితురాలు అల్లం సునీతగా గుర్తించారు. పిఠాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో థియేటర్ అసిస్టెంట్‌గా సునీత పనిచేస్తోంది. ఈ క్రమంలో నిన్న (బుధవారం) రాత్రి విధులు ముగించుకుని సునీత ఇంటికి బయలుదేరింది. అంతలోనే కొందరు ఆగంతకులు బైక్‌పై వచ్చి ఆమెను అడ్డగించారు. వెంటనే సునీతపై తమ వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశారు.
దుండగుల దాడితో భయాందోళనకు గురైన బాధితురాలు గట్టిగా కేకలు పెట్టింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఆగంతకుల దాడిలో సునీత శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. పిఠాపురం సీతయ్యగారి తోట శివారు నరసింగపురం రోడ్డులో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో సునీత అక్కడే స్పృహతప్పి పడిపోయింది. సునీత అరుపులతో బయటకు వచ్చిన స్థానికులు ఆమె రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయాలతో ఉన్న సునీతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ముందుగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం సునీతను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దాడి ఘటన బంగారం చోరీ కోసమా లేక వ్యక్తిగత విభేదాల కారణం గానా అని పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి
ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
Read Latest AP News And Telugu News