Aadudam Andhra: ముగిసిన ఆడుదాం ఆంధ్రా విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 07:28 PM
అమరావతి: ఆడుదాం ఆంధ్రా అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. సోమవారం నాడు ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
అమరావతి: 'ఆడుదాం ఆంధ్రా' అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. రేపు(సోమవారం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్రాలో సుమారు రూ.40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్లు సమాచారం. నివేదిక పరిశీలన అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ కార్యక్రమం కింద 47 రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు.
గత వైసీపీ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో ఆడుదాం ఆంధ్రా క్రీడలను ప్రారంభించింది. అయితే ఆ పథకానికి రూ.125 కోట్ల నిధులను కేటాయించింది అప్పటి ప్రభుత్వం. కాగా, ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలు జరిగాయని , విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు కోరడంతో ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆడుదాం ఆంధ్రా కోసం అదనంగా నిధులు కేటాయించినట్టు విజిలెన్స్ విభాగం తేల్చింది. పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై బ్రాండెడ్ స్టిక్కర్లు, క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసినట్టు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. అయితే విజేతలుగా కూడా.. వైసీపీ కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు అధికారులు గుర్తించారు.
మాజీ సీఎం జగన్ హయాంలో 47 రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. కొత్త శాప్ ఛైర్మన్ ఛార్జ్ తీసుకునే లోపలే కొంతమంది అధికారులు వివరాలు డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి క్రీడా మంత్రి రోజా, ఆమె సోదరుడు పాత్రపైనా ఆధారాలను విజిలెన్స్ విభాగం సంపాదించినట్లు తెలుస్తోంది. అలాగే అప్పటి శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపైనా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నివేదికలో పలు ఆధారాలను కూడా అధికారులు పొందుపరిచినట్లు సమాచారం. రేపు విజిలెన్స్ అధికారుల నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఏసీబీ విచారణకు అప్పగించే అవకాశం ఉంది.