Share News

Minister Kollu Ravindra: మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Jan 21 , 2025 | 07:51 PM

Minister Kollu Ravindra: వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మధ్యధరలు పెరగడంతో తక్కువ ధరకు దొరికే గంజాయికి యువత అలవాటు పడ్డారని అన్నారు.

 Minister Kollu Ravindra: మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్..  ప్రభుత్వం కీలక నిర్ణయం
Minister Kollu Ravindra

విశాఖపట్నం(పెందుర్తి): మద్యం క్వాలిటిని 6 రకాల టెస్టులు చేసి కూటమి ప్రభుత్వం అమ్ముతుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నాణ్యమైన మందు అందించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు కొంత మెరుగుపడుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ జెర్రి పోతులపాలెం డిపోను మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం నాడు తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించారు. డిపోలో ఉన్న కార్మికులతో మాట్లాడి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి డిపోల్లో జరుగుతున్న విధానాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. జగన్ ప్రభుత్వ పాలనలో స్కానింగ్ స్టిక్కర్ మాత్రమే వేశారని, కాని కూటమి ప్రభుత్వంలో ఆ స్టికర్‌పై స్కాన్ చేస్తే అది ఎక్కడకు వెళ్లింది, ఎక్కడ నుంచి వచ్చిందో తెలుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కానింగ్ ప్రక్రియ లేకపోవడంతో పక్క రాష్ట్రల నుంచి కూడా మద్యం తెప్పించి అమ్మేవారని చెప్పారు. గతంలో మద్యం ఏ బ్రాండ్‌ది ఉందో, ఎన్ని బ్రాండులు ఉండేవో తెలిసేది కాదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో తక్కువ ధరకు దొరికే గంజాయికి యువత అలవాటు పడి ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు, మద్యం రేట్లతోనే యువత మద్యం కొనలేక గంజాయికి అలవాటు పడిపోయారని మంత్రి రవీంద్ర అన్నారు.


రాష్ట్రంలో బెల్ట్ షాప్‌ల నిర్వహణ చేస్తే వారిపై కేసులతో పాటు షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 29 నుంచి ‘‘నవోదయ’’ అనే కొత్త కార్యక్రమం ద్వారా కల్తీ సారా, కల్తీ మద్యాన్ని పూర్తిగా నియంత్రించే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. కళ్లు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10శాతం చొప్పున 340 షాపులను కేటాయించడంతోపాటు 50శాతం లైసెన్స్ ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వైన్ షాపుల మార్జిన్ సరిపోవటం లేదని ప్రభుత్వం దృష్టికి రావడంతో మార్జిన్ విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


కల్లుగీత కార్మికుల కుటుంబాల్లో అనందం: మంత్రి అనగాని సత్యప్రసాద్

anagani-satyaprasad-minister.jpg

అమరావతి: కల్లు గీత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కల్లుగీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయిస్తూ రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మికుల కుటుంబాల్లో అనందాన్ని నింపిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇది బీసీల ప్రభుత్వమని మరోసారి స్పష్టమైందని చెప్పారు.


కులవృత్తినే నమ్ముకొని ఇబ్బందులు పడుతున్న కల్లుగీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించడం చారిత్రక నిర్ణయమని అన్నారు. జగన్ ప్రభుత్వం చీప్ లిక్కర్ ను తీసుకొచ్చి కల్లుగీత కార్మికులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మాత్రం వారికి మద్యం షాపులు కేటాయించి వారిని ఆదుకుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. ఆదరణ పథకాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గత ఏడు నెలల కాలంలో అన్ని రంగాల్లో బీసీలకు అధిక ప్రాధన్యత ఇస్తోందని చెప్పుకొచ్చారు. బీసీలతోపాటు అన్ని వర్గాలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Updated Date - Jan 21 , 2025 | 08:04 PM