Anitha Phone Call To Kotamreddy: కోటంరెడ్డి హత్యకు ప్లాన్.. హోం మంత్రి అనిత ఫోన్
ABN , Publish Date - Aug 29 , 2025 | 08:38 PM
టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని మంత్రులు, కీలక నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 29: టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసే పథక రచనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆ క్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఇవాళ (శుక్రవారం) స్వయంగా ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలంటూ ఆయనకు మంత్రి అనిత సూచించారు. ఈ ప్రభుత్వం మొత్తం మీకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆమె భరోసా కల్పించారు.
విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వద్ద మీడియాతో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. ఏన్డీయే ప్రభుత్వంలో తప్పుచేసిన వారిని వెంటనే శిక్షించడం జరుగుతుందని స్పష్టం చేశారు. జూదం ఆడినా, మద్యం సేవించినా వెంటనే శిక్షించే స్థాయిలో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉందని తెలిపారు. ఈగల్ ద్వారా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. మహిళల విషయంలో విశాఖ సేఫెస్ట్ సిటీగా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు విశాఖకు వస్తుంటే యువతకు ఉద్యోగాలు వస్తాయనే భరోసా ఉందని చెప్పారు. చంద్రబాబుని చూసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనలో ఎన్డీఏ కూటమి నిబద్ధతతో ఉందని తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయని హోంమంత్రి తెలిపారు.
స్పందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి..
వైసీపీ హయాంలో జరిగిన రౌడీషీటర్ల ఆగడాలు, కుట్రలు, కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పట్లో వైసీపీని వీడుతున్నారని ఏకంగా హత్య చేసేందుకే కుట్ర చేశారంటే రౌడీయిజం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోందన్నారు. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు ప్రశాంతతకు మారు పేరైన నెల్లూరుకు మాయని మచ్చగా మారాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరుడుగట్టిన ఈ క్రిమినల్స్‌కు వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రౌడీ గ్యాంగులను కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిందేనన్నారు. శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరగడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
త్వరలోనే పూర్తి విషయాలు వెల్లడిస్తాం: జిల్లా ఎస్పీ
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య ప్లాన్ వీడియోలోని అంశం తమ దృష్టికి వచ్చిందని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు. త్వరలోనే పూర్తి విషయాలు వెల్లడిస్తామని ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
18 అడుగులు పెరిగిన మొక్క జొన్న మొక్క
టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర.. వీడియో బహిర్గతం
For More Andhrapradesh News And Telugu News