Heavy Rain Alert: మళ్లీ భారీ వర్షాలు.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:37 PM
రాగల ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసినట్లు వివరించింది.
విశాఖపట్నం, సెప్టెంబర్ 26: వాయవ్య, మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం ఇవాళ (శుక్రవారం) వెల్లడించింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బలపడి మరికొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం పశ్చిమ దిశగా కదులుతూ శనివారానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాగల ఐదు రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. అయితే రానున్న 24 గంటలలో మాత్రం కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఇక ఈరోజు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.
అలాగే కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
శనివారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది.
అయితే కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. కృష్ణపట్నం మినహా కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వాతాాావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వం కృషితో భారత్‌కు కాకినాడ మత్స్యకారులు
Read latest AP News And Telugu News