Deputy CM Pawan Kalyan: జస్టిస్ గవాయ్‌పై దాడి యత్నం.. ఖండించిన పవన్
ABN , Publish Date - Oct 06 , 2025 | 10:02 PM
సుప్రీంకోర్టులో కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు.
అమరావతి: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడి యత్నంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సీజేఐపై దాడి యత్నం తీవ్ర కలతకు గురిచేసిందని అన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ తెలిపారు. 'ఇందులోని లోతైన భావాలను మేము అర్థం చేసుకున్నాము. కానీ మార్గ దోషం ఇప్పటికీ ధర్మాన్ని అతిక్రమించడమే. అన్నింటికంటే ముఖ్యంగా రాజ్యాంగ గౌరవాన్ని కాపాడాలి. మన పురాతన గ్రంథాలు న్యాయం ప్రక్రియ ద్వారా సాధించబడుతుందని బోధిస్తాయి. శాంతిభద్రతల కోసం నిలబడే లక్షలాది మంది సనాతనుల సంకల్పాన్ని అవమానపరిచే ఏ చర్యనైనా మేము వ్యతిరేకిస్తాం. సీజేఐ కార్యాలయం గౌరవానికి జనసేన దృఢంగా అండగా నిలుస్తుంది.' అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. అనంతరం అతన్ని బయటకు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్.. ఇలాంటి వాటి వల్ల ఎవరూ ఆందోళనకు గురి కావొద్దని తెలిపారు. తాను చలించడం లేదని, ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కోర్టులో యధావిధిగా వాదనలు కొనసాగించమని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు