Cyclone Montha Visakha Mayor: మొంథా తుపాన్.. విశాఖ మేయర్ ఎమర్జెన్సీ మీటింగ్
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:55 PM
ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు, నైట్ షెల్టర్స్‌ను స్వయంగా వెళ్లి పరిశీలించినట్లు విశాఖ మేయర్ చెప్పారు. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా ఎదుర్కొనేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
విశాఖపట్నం, అక్టోబర్ 27: మొంథా తుపాన్ నేపథ్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు (Mayor Peela Srinivasa Rao) ఈరోజు (సోమవారం) అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మొంథా తుపాన్ నేపపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు సమీక్షలు, క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తున్నామన్నారు. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు, నైట్ షెల్టర్స్‌ను స్వయంగా వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా ఎదుర్కొనేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
తుపాన్ తీవ్రత తగ్గే వరకు 24x7 అధికారులు, కార్మికులు అందుబాటులలో ఉంటారని వెల్లడించారు. రాత్రి సమయంలో పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పుకొచ్చారు. విద్యుత్, తాగునీరు, మౌలిక సదుపాయాలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మరోవైపు మొంథా తుపాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ దగ్గరకు వచ్చేకొద్ది మారింత ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ. వేగంతో మొంథా తుపాన్ కదిలిందని.. ప్రస్తుతానికి చెన్నైకి 480 కి.మీ., కాకినాడకు 530 కి.మీ., విశాఖపట్నానికి 560 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు (మంగళవారం) ఉదయానికి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి..
బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి
తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురుగాలులతో వర్షాలు స్టార్ట్
Read latest AP News And Telugu News