Cyclone Montha: తుపాన్ ఎఫెక్ట్.. ఈదురుగాలులతో వర్షాలు స్టార్ట్
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:23 PM
ప్రస్తుతానికి చెన్నైకి 520 కి.మీ, కాకినాడకి 570 కి.మీ, విశాఖపట్నానికి 600 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు (మంగళవారం) ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది.
అమరావతి, అక్టోబర్ 27: మొంథా తుపాన్ (Cyclone Montha) రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇప్పటికే తుపాన్ ప్రభావం ప్రారంభమైంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం పడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలో మీటర్ల వేగంతో మొంథా తుపాన్ కదిలింది. ప్రస్తుతానికి చెన్నైకి 520 కి.మీ, కాకినాడకు 570 కి.మీ, విశాఖపట్నానికి 600 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు (మంగళవారం) ఉదయానికి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది.
తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అయితే వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండవద్దని.. అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. తుపాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు. తుపాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. కాకినాడ జిల్లాలో 6 మండలాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాకినాడ జిల్లాలో ఎక్కువ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు బ్లాక్ అయితే డైవర్షన్స్ ముందే మ్యాప్ చేసుకోవాలని.. జిల్లా, మండల కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రతి ఒక్కరికి చేరవేయాలని సూచించారు. చెట్లు, స్తంభాలు పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్నారు. ముందుగానే ట్రాన్స్ ఫార్మర్లు, పోల్స్ సిద్ధంగా ఉంచాలని అధికారులకు తెలిపారు. జేసీబీలు, జనరేటర్స్ సిద్ధం చేయాలని.. భారీ హార్డింగ్స్‌ను తొలగించాలని ఆదేశించారు. డెలివరీ దగ్గరలో ఉన్న గర్భిణీల కుటుంబాలను అలర్ట్ చేయాలన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్సులు ఏర్పాటు చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు హోంమంత్రి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
మొంథా తుఫాన్.. సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్
బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి
Read latest AP News And Telugu News