AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురికి బెయిల్..
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:57 PM
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణంలో కేసులో నిందితులుగా ఉన్న ఏ31-ధనుంజయ రెడ్డి, ఏ32-కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు ముగిసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) ముగ్గురికీ బెయిల్ మంజూరు చేస్తూ.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు మే 14న బాలాజీ గోవిందప్ప, మే 17న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు బెయిల్ కోసం.. ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. ముగ్గురు పాస్‌పోర్ట్‌లు అధికారులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఒక్కొక్కరు లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని తెలిపింది.
జగన్ ప్రభుత్వం హయాంలో మద్యం విక్రయాల లావాదేవిలన్ని నేరుగా జరిగాయి. అంటే ఎక్కడ డిజిటల్ చెల్లింపులు అనేవి జరగలేదు. దీంతో ఈ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం విక్రయాలకు తెర తీశారు. ఈ మద్యం తాగడం వల్ల అనేక మంది మృత్యువాత పడ్డారు. అలాగే పలువురు అనారోగ్యానికి గురయ్యారు. అంతేకాకుండా.. ఈ మద్యం విక్రయాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందంటూ ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణంపై సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిను సిట్ అధికారులు అరెస్ట్ చేసి.. విచారించారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కారుకు జరిమానా.. డిస్కౌంట్‌తో చెల్లింపు
ఆపరేషన్ సిందూర్ ముగియలేదు... ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు