CII Partnership Summit 2025: పలు అవగాహన ఒప్పందాలు.. వివరించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 14 , 2025 | 09:00 PM
సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం విశాఖపట్నం వేదికగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు విదేశీ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా వివరించారు.
విశాఖపట్నం, నవంబర్ 14: విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వివిధ సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ఆ జాబితాలో దేశీ విదేశీ సంస్థలు సైతం ఉన్నాయి. బుధ, గురువారాల్లో సైతం సీఎం చంద్రబాబు.. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు నాయుడు సోదాహరణగా వివరించారు.
విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌కు విమానంలో వెళ్లవచ్చునని తెలిపారు. ఈ విమానం ప్రారంభించడానికి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపారు. సింగపూర్ హోం, న్యాయ శాఖల మంత్రి కె. షణ్ముగం, ఆ దేశ విదేశాంగ మంత్రి శ్రీమతి సియో హువాంగ్‌తో కలిసి పాల్గొన్నారని వివరించారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమైందని.. అందుకు ఆయనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల్లోని కుటుంబాలు, వ్యాపారాలు, అవకాశాలను దగ్గర చేస్తోందని అభిప్రాయపడ్డారు. అలాగే ఇరు దేశాల మధ్య విశ్వసనీయ భాగస్వామ్యం బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు.
స్థిరమైన పట్టణ పాలన, డిజిట్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ధి తదితర కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి తాము ఒక సమగ్ర అవగాహన ఒప్పందంపై సంతకం చేశామన్నారు. ఈ ఒప్పందంలో సింగపూర్ ఒక భాగస్వామిగా ఉందని తెలిపారు. తాము సంతకం చేసిన ఈ అవగాహన ఒప్పందాలు తమ సహకారాన్ని మరింతగా పెంచుతాయని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు నుంచి రాయలసీమకు మరో ప్రధాన ప్రోత్సాహం అందనుందని తెలిపారు. భారతదేశ డ్రోన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారనుందన్నారు. దేశంలోడ్రోన్ విప్లవానికి ఇది నాంది కానుందని చెప్పారు. ఈ రోజు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌లో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీకి పునాది రాయిని వర్చువల్‌గా వేయడం తమకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
డ్రోన్ సిటీ పూర్తిగా.. డిజైన్, తయారీ, పరీక్ష, నైపుణ్యం, పరిశోధన, అభివృద్ధి, సేవలు అందిస్తుందని.. ఇది పూర్తి పర్యావరణ వ్యవస్థతో నిర్మితమవుతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో ఈ అధునాతన సాంకేతికను తీసుకు రావడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య వృద్ధిని నిర్ధారించడం కోసం తాము నిబద్ధతతో వేసిన ముఖ్యమైన అడుగని తెలిపారు.
శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో దేశంలోనే మొట్టమొదటి జంట అంతరిక్ష నగరాలకు పునాది వేయడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. శ్రీసత్యసాయి పరిశోధన, ఉపగ్రహ నమూనా తయారీతోపాటు అంతరిక్ష సాంకేతిక స్టార్టప్‌లు పెంపొందిండంపై దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నారు. తయారీ, ఉపగ్రహ ఏకీకరణ లాంచ్ లాజిస్టిక్‌లను తిరుపతిలో తీసుకు రానున్నారని వివరించారు.
తమ ఏపీ స్పేస్ పాలసీ 4.0 మద్దతుతో ఈ చొరవ తీసుకున్నట్లు తెలిపారు. దీనికి స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపులు, పరిశోధన, అభివృద్ధికి నిధులతోపాటు రూ. 100 కోట్ల స్పేస్‌టెక్ ఫండ్‌తో.. వచ్చే దశాబ్దంలో రూ. 25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. దీనితోపాటు 35 వేల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుకుందని సీఎం చంద్రబాబు వివరించారు.
ఈ రెండు.. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలు 2047 నాటికి స్వర్ణాంధ్ర రోడ్ మ్యాప్‌కు మూల స్తంభాలుగా నిలుస్తాయని తెలిపారు. ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ రూపొందించిన వికసిత భారత్ విశాల దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న జాబితాలోని వివరాలు ఇవిగో..
ఈ వార్తలు కూడా చదవండి..
తిమ్మక్కకు డిప్యూటీ సీఎం పవన్ ఘన నివాళి
అప్పినపల్లి గ్రామస్తులను మెచ్చుకున్న పవన్.. ఎందుకంటే
For More AP News And Telugu News