Share News

Pawan Kalyan: తిమ్మక్కకు డిప్యూటీ సీఎం పవన్ ఘన నివాళి

ABN , Publish Date - Nov 14 , 2025 | 05:46 PM

తిమ్మక్క జీవితంలో అధికారం కోసం.. సంపద కోసం వెతకలేదన్నారు పవన్. కానీ భూమి తల్లి పట్ల ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనమని తెలిపారు. అలాంటి 114 ఏళ్ల తిమ్మక్క.. ఈ రోజు మనల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారన్నారు.

Pawan Kalyan: తిమ్మక్కకు డిప్యూటీ సీఎం పవన్ ఘన నివాళి
AP Dy CM Pawan kalyan

అమరావతి, నవంబర్ 14: కర్ణాటకకు చెందిన చెట్టు తల్లి సాలుమరద తిమ్మక్క శుక్రవారం మరణించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. కర్ణాటకలో చిన్న గ్రామానికి చెందిన తిమ్మక్క దంపతులకు పిల్లలు లేరని.. ఈ నేపథ్యంలోనే వారు చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఆ క్రమంలో స్వచ్ఛమైన ప్రేమ, నిరంతర శ్రమలో దాదాపు 8 వేల మొక్కలను ఆ దంపతులిద్దరూ నాటారని పేర్కొన్నారు. అందులో 375 మర్రి చెట్లు సైతం ఉన్నాయని వివరించారు.


తిమ్మక్క జీవితంలో అధికారం కోసం.. సంపద కోసం వెతకలేదన్నారు పవన్. కానీ భూమి తల్లి పట్ల ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనమని తెలిపారు. అలాంటి 114 ఏళ్ల తిమ్మక్క.. ఈ రోజు మనల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారన్నారు. నిజమైన ప్రజా సేవకు ఆమె జీవితం శక్తిమంతమైన పాఠమని అభివర్ణించారు. చెట్టు తల్లిని మనం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆమె స్ఫూర్తి మాత్రం మనతోనే ఉందన్నారు.


పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడంతోపాటు ఈ భూమిపై మనం బాధ్యతతో మెలగడానికి మనందరికీ ఆమె స్ఫూర్తిని ఇస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణాన్ని కాపాడతామని చెప్పి అడువులు నాశనం చేశారని.. తమ స్వార్థం కోసం ఆ వనరులను అక్రమంగా రవాణా చేసిన వారి సైతం మనమంతా చూశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సాలుమరద తిమ్మక్కకు జనసేన తరఫున ఘనంగా పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.


కర్ణాటకకు చెందిన చెట్టు తల్లి, పద్మశ్రీ పురస్కార గ్రహీత సాలుమరద తిమ్మక్క శుక్రవారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆమె శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆ క్రమంలో బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. ఈ మేరకు ఆమె మృతివార్తను కుటుంబసభ్యులు వెల్లడించారు. 1911, జూన్ 30న ఆమె జన్మించారు. వృక్ష సంరక్షణకు తన జీవితాన్ని ఆమె అంకితం చేశారు. తిమ్మక్క నిస్వార్థ సేవలకుగానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Deputy CM Pawan: అప్పినపల్లి గ్రామస్తులను మెచ్చుకున్న పవన్.. ఎందుకంటే

Srivari Parakamani Money Theft Case: పరకామణి చోరీ కేసు సాక్షి సతీష్‌ దారుణ హత్య..!

Updated Date - Nov 14 , 2025 | 08:19 PM