Anakapalli Accident: తండ్రి ఆటో కిందే పడి కూతురు దుర్మరణం.. అనకాపల్లిలో విషాదం
ABN , Publish Date - Dec 13 , 2025 | 10:39 AM
అనకాపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు తీసుకెళ్తున్న కుమార్తె.. తండ్రి కళ్లముందరే ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
అనకాపల్లి జిల్లా, డిసెంబర్ 13: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికీ తెలీదు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తమ కళ్లముందే ఉన్న వారు హఠాత్తుగా మృత్యుఒడిలోకి వెళుతుంటారు. అనుకోని ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు విడుస్తుంటారు. అయితే కళ్లెదుట అయిన వారు ప్రాణాలు విడిస్తే ఆ బాధ వర్ణణాతీతమనే చెప్పుకోవాలి. ప్రాణాల కోసం కొట్టమిట్టాడుతున్న ఆత్మీయులను కాపాడుకోలేక వారు నరకయాతన అనుభవిస్తారు. ఇలాంటి ఘటనే అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి కళ్ల ముందరే కుమార్తె ప్రాణాలు విడిచింది. తన ముందే కన్నబిడ్డ అలా చనిపోవడంతో ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. వివరాల్లోకి వెళితే..
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సునీత అనే (18) యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అది కూడా తండ్రి ఆటో కింద పడి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈరోజు టెట్ పరీక్ష కోసం స్వయంగా తండ్రి ఆటోలోనే పరీక్షా కేంద్రానికి బయలుదేరింది సునీత. కుమార్తెను ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లేందుకు సదరు తండ్రి గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నాడు. అయితే అదే తన కుమార్తెను దూరం చేస్తుందని అతడు ఊహించలేకపోయాడు.
గూగుల్ మ్యాప్ చూసుకుంటూ ఆటో నడుపుతుండగా అనకాపల్లి జిల్లా సుంకరమేట్ట వద్ద ఆటో ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పరీక్ష రాసేందుకు వెళ్తున్న కూతురు.. తన ఆటోకింద పడి ప్రాణాలు వివడవడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..
ఆ రైతులతో మరోసారి మాట్లాడతాం: పెమ్మసాని చంద్రశేఖర్
Read Latest AP News And Telugu News