Andhra Cricket Association: విశాఖ వేదికగా వరల్డ్ కప్ ఉమెన్స్ క్రికెట్ టోర్నీ మ్యాచ్‌లు
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:41 PM
ఉమెన్స్ వరల్డ్ కప్ సందర్భంగా విశాఖపట్నంలో 5 మ్యాచ్‌లు నిర్వహణకు అనుమతి వచ్చిందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని నాని వెల్లడించారు.
విజయవాడ, జూన్ 08: రాజధాని అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. అయితే అమరావతిలో అత్యుత్తమ వసతులతో భారీ స్టేడియం నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశించారని గుర్తు చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)కు త్వరలో స్థలం రాగానే నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో స్టేడియం కోసం 65 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు.
లక్ష మంది కూర్చునేలా అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించాలని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున చాలా కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. 45 రోజుల్లోనే విశాఖపట్నంలో 2 ఐపీఎల్ మ్యాచ్‌లు విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఉమెన్స్ వరల్డ్ కప్ సందర్భంగా విశాఖలో 5 మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి వచ్చిందన్నారు. వచ్చే రెండేళ్లలో 25 జిల్లాల్లోనూ క్రికెట్ గ్రౌండ్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కర్నూలు, నెల్లూరులో స్థలం ఉన్నందున ఆయా నగరాల్లో క్రికెట్ స్టేడియంలు నిర్మించేలా చర్యలు చేపడతామని చెప్పారు. అన్ని జిల్లాల్లో మ్యాచ్‌లు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.
రూ.40లక్షలకు పెంచాం..
ఏపీలోని ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్లు నిర్మించేలా ముందుకు వెళ్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీశ్ స్పష్టం చేశారు. 60 రోజుల్లో వైజాగ్ స్టేడియం రూపురేఖలు మార్చామని తెలిపారు. విశాఖపట్నంలో వరల్డ్ కప్ ఉమెన్స్ క్రికెట్ టోర్నీ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి వచ్చిందని వివరించారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వరల్డ్ కప్ ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్‌లు ఐదు జరుపుతామన్నారు. అలాగే జిల్లాకు ఇచ్చే నిధులు రూ. 20లక్షల నుంచి రూ. 40లక్షలకు పెంచాలని నిర్ణయించామని ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ కార్యదర్శి సానా సతీశ్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన సీఎం చంద్రబాబు
కిషన్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్ష విమర్శలు
For AndhraPradesh News And Telugu News