CID Investigation : ‘కాకినాడ’ నుంచి సండూర్ దాకా!
ABN , Publish Date - Jan 07 , 2025 | 03:01 AM
కాకినాడ సీ పోర్ట్స్, సెజ్‌ల్లోని తన వాటాను వైసీపీ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ ప్రముఖ వ్యాపారవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.

విజయసాయిపై ఈడీ ప్రశ్నల వర్షం
కాకినాడ ‘డీల్’పై సుదీర్ఘ విచారణ
అనూహ్యంగా ‘సండూర్’పైనా ప్రశ్నలు
పెట్టుబడులు ఎక్కడివని ఆరా
తెలియదు.. గుర్తులేదని దాటవేత
ఏ-2గా, ఆడిటర్‌గా ఉంటూ తెలియదంటే ఎలా అని ఈడీ ప్రశ్న
పోర్టు, సెజ్‌లపైనా సూటిగా ప్రశ్నలు
అవసరమైతే మళ్లీ పిలుస్తామన్న ఈడీ
కాకినాడ సీపోర్టు, సెజ్‌లో వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ‘కాకినాడ’కే పరిమితం కాకుండా... జగన్ అక్రమాస్తుల కేసులో కీలకమైన ‘సండూర్ పవర్’లో పెట్టుబడులపైనా ప్రశ్నలు సంధించారు.. అనూహ్యంగా సండూర్ కేసు తెరపైకి రావడంతో విజయసాయి అవాక్కయినట్లు తెలిసింది.. కాసేపు ఆగి ‘తెలియదు’, ‘గుర్తు లేదు’ అని బదులిచ్చినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏం జరిగిదంటే...
హైదరాబాద్/అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాకినాడ సీ పోర్ట్స్, సెజ్‌ల్లోని తన వాటాను వైసీపీ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ ప్రముఖ వ్యాపారవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఈ వ్యవహారంలోని మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దృష్టి సారించింది. ఈ కేసులోని నిందితులను ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తోంది. ఈ క్రమంలో విచారణకు రావాల్సిందిగా జారీ చేసిన నోటీస్ మేరకు విజయసాయి సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరయ్యారు. ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన విజయసాయి రెడ్డిని ప్రత్యేక బృందం సాయంత్రం వరకు విచారించింది. సుమారు ఆరు గంటలకుపైగా సాగిన విచారణలో కాకినాడ సెజ్, కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ షేర్ల బదలాయింపునకు సంబంధించిన అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు.
షేర్లకు సంబంధించిన నగదు బదలాయింపులపైనా అధికారులు ఆరా తీశారు. రంగనాథం అండ్ కంపెనీ, సంతానం అండ్ కంపెనీలను ఎవరు ప్రభుత్వానికి పరిచయం చేశారు... ‘అరబిందో’ శరత్ చంద్రారెడ్డి ఎలా పరిచయం అంటూ ప్రశ్నించారు. దానిపై విజయసాయి రెడ్డి ఇచ్చిన సమాధానాలను ఈడీ అధికారులు రికార్డు చేశారు. కేసు విచారణకు అవసరమైన కీలక సమాచారం విజయసాయి నుంచి రాబట్టే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా అధికారుల బృందం ముందుకెళ్లింది. ఎక్కువ ప్రశ్నలకు ఆయన సమాధానం దాట వేసినట్లు తెలిసింది. ‘తెలియదు, నాకు సంబంధంలేదు’ అని చెప్పినట్లు సమాచారం.
సండూర్ గురించీ తెలియదనే...
సండూర్ పవర్ కేసులో జగన్ ఏ1 కాగా, విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్నారు. ఆ కంపెనీ ఆడిటర్ కూడా ఆయనే. కాకినాడ పోర్టు, సెజ్‌కు సంబంధించిన ప్రశ్నలకు తగిన ‘సమాధానాల’తో సిద్ధమై వెళ్లిన సాయిరెడ్డి... అక్కడ సండూర్ పవర్ అంశం తెరపైకి వచ్చేసరికి షాక్‌కు గురైనట్లు తెలిసింది. ‘సండూర్ పవర్‌లో పెట్టుబడులు ఎక్కడ నుంచి వచ్చాయి?’ అని ప్రశ్నించగా... ‘తెలియదు’ అని బదులిచ్చారు. ‘‘ఈ కేసులో మీరు రెండో నిందితుడు. పైగా కంపెనీ ఆడిటర్. అయినా పెట్టుబడుల గురించి తెలియదా’ అని ప్రశ్నించగా... ‘‘కావొచ్చు. ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వ్యవహారం అది. ఇప్పుడెలా గుర్తుంటుంది?’’ అని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. పెట్టుబడుల విషయాలు బాగా తెలుసు కదా అని ఆరా తీయగా... ఇప్పుడు తనకేవీ గుర్తు లేవని చెప్పినట్లు తెలిసింది. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సాయిరెడ్డిని ఈడీ అధికారులు పంపించారు. ఈడీ విచారణ తర్వాత బయటికి వచ్చిన సాయి రెడ్డి.. ఈడీ పాత కేసుల్లో ఉచ్చు బిగిస్తున్నట్లు అనుమానంగా ఉందని తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం.
కేవీ రావు ఎవరో తెలియదు: సాయిరెడ్డి
ఈడీ విచారణ అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ అధికారులు నన్ను ప్రశ్నించారు. నేను మే 2020లో కేవీ రావుకు ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డితో కాకినాడ సీ పోర్ట్స్ విషయం మాట్లాడాలని చెప్పాననేది నాపై ప్రధాన ఆరోపణ. రంగనాథన్ అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్, శ్రీధరన్ అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్....ఈ రెండు కంపెనీలను ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు నేను సిఫారసు చేశానని కేవీ రావు ఆరోపణలు చేశారు. ఈ విషయంలో ఈడీ అధికారులు ప్రశ్నించగా, కేవీ రావు అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్పాను. కేవీ రావు పిర్యాదులో వాస్తవాలు ఉంటే ఆయన పేరులోనే వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి... తిరుపతి వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఆయన ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు వాస్తవమని స్వామివారి ముందు చెప్పాలి. మా ఇద్దరికి క్రాస్ ఎగ్జామినేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను అడిగాను. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అని రుజువైనా...ఆ కేసును ఏపీ ప్రభుత్వం విత్‌డ్రా చేసుకున్నా... కోర్టు ఈ ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అని చెప్పినా... కేవీ రావుపై సివిల్, క్రిమినల్ పరువునష్టం దావా వేస్తానని ఈడీ అధికారులకు చెప్పాను. ఈడీ అడిగిన 25 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. సుబ్బారెడ్డి కొడుకుగా మాత్రమే విక్రాంత్ రెడ్డి తెలుసునని చెప్పాను. సండూర్ గురించి పదే పదే ప్రశ్నించారు’’ అని విజయసాయి రెడ్డి మీడియాకు వెల్లడించారు.