Advocate General : ‘సాక్షి’ ఉద్యోగులకు సర్కారు జీతాలు!
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:18 AM
సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ హోదాలో తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ సొమ్మును సాక్షిపత్రికకు, సాక్షి టీవీచానల్‌కు దోచిపెట్టారని....
సమాచార, పౌరసంబంధాలశాఖ నుంచి చెల్లించారు
ప్రభుత్వ సొమ్మును ఆ పత్రికకు, చానల్‌కు దోచిపెట్టారు
రూ.371 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు ఒక్క ‘సాక్షి’కే ఇచ్చారు
లోతైన విచారణ తర్వాతే విజయ్‌కుమార్‌రెడ్డిపై ఏసీబీ కేసు
ప్రాథమిక దశలో దర్యాప్తు.. బెయిల్ ఇస్తే సాక్షులపై ప్రభావం
హైకోర్టులో ఏసీబీ తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు
ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థన.. విచారణ 27కు వాయిదా
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ హోదాలో తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ సొమ్మును సాక్షిపత్రికకు, సాక్షి టీవీచానల్‌కు దోచిపెట్టారని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు గురువారం ఆయన వాదనలు వినిపించారు. వైసీపీ ప్రభుత్వ హయాం మొత్తం రూ.859 కోట్ల ప్రభుత్వ ప్రకటన(యాడ్)లు ఇవ్వగా, అందులో ఒక్క ‘సాక్షి’కే రూ.371 కోట్ల ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. ప్రకటనలకు ‘సాక్షి’ యాజమాన్యం ప్రతిపాదించిన రేటుకు మించి అధిక మొత్తం చెల్లించారని, ప్రభుత్వ ఖజానాకు రూ.19 కోట్ల నష్టం కలిగించారన్నారు.ట రాష్ట్రంలో అధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికకు 28శాతం ప్రకటనలు ఇస్తే, రెండో స్థానంలో ఉన్న ‘సాక్షి’ పత్రికకు 43శాతం, మూడవ స్థానంలో ఉన్న పత్రికకు 0.03 శాతం ప్రకటనలు ఇచ్చారని వివరించారు. ఇక ఏపీలో ఎడిషన్ కూడా ప్రచురించని ఓ పత్రికకు రూ 1.17కోట్లు చెల్లించారని తెలిపారు. అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీల నుంచి కమిషన్ తీసుకున్నారని, తద్వారా అనుచిత లబ్ధిపొందారని వివరించారు. ప్రభుత్వ ప్రకటనల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారన్నారు. చట్టనిబంధనలను అనుసరించకుండా మొత్తం 254 మంది అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించారని, ఉద్యోగుల జాబితాను పిటిషనరే అందజేసి వారి నియామకానికి ఫైలు సిద్ధం చేయాలని తన కింది ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినట్టు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. కొంతమంది ‘సాక్షి’ ఉద్యోగులకు ఎలాంటి నియామక ఉత్తర్వులూ లేకుండానే సమాచారశాఖ నుంచి జీతాలు చెల్లించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తనపై ప్రతీకారం తీర్చుకుంటోందన్న పిటిషనర్ వాదనలో వాస్తవం లేదన్నారు.
సమాచార కమిషనర్‌గా విజయ్‌కుమార్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని థర్డ్ పార్టీ.. విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారని, దీనిపై విజిలెన్స్ విభాగం కూడా నివేదిక సమర్పించిందని, ఆ నివేదిక ఆధారంగానే ఏసీబీ అధికారులు లోతైన విచారణ జరిపి, అన్ని విషయాలు నిర్ధారించుకొన్న తర్వాతే విజయ్‌కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారని తెలిపారు. విజయ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు అధికారిగా ఉన్న ఆయనను డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చారని చెప్పారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయనను సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్‌గా, సాధారణ పరిపాలనశాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగా నియమించారని తెలిపారు. సమాచారశాఖ కమిషనర్ హోదాలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, సాధారణ పరిపాలనశాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఆ ప్రతిపాదనలకు ఆయనే ఆమోదం తెలుపుతూ ద్విపాత్రాభినయం చేశారని, ఆయనను రాష్ట్రానికి తీసుకురావడంలో కుట్ర ఉందా? అనే విషయం దర్యాప్తులో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ తప్పుచేశారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, విజయ్‌కుమార్ రెడ్డి కింద పనిచేసిన ఉద్యోగులనూ విచారించాల్సి ఉందని, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. కాగా, గురువారం ఏసీబీ తరఫు వాదనలు ముగిశాయి. సాంకేతికపరమైన అంశాలపై కోర్టు లేవనెత్తిన సందేహాలపై స్పష్టత కోసం, పిటిషనర్ తరఫు రిప్లై వాదనల కోసం విచారణను న్యాయస్థానం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.దిల్లీబాబురెడ్డి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు విజయ్‌కుమార్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం విజయ్‌కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News