TTD : ‘తొక్కిసలాట’పై కొనసాగిన న్యాయవిచారణ
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:57 AM
టీటీడీ, రుయా, స్విమ్స్, పోలీసు అధికారులను కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి వేర్వేరుగా విచారించారు.

రెండో రోజు టీటీడీ ఈవో, పలువురు అధికారుల హాజరు
నేడు కలెక్టర్, రెవెన్యూ అధికారులు
తిరుపతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన న్యాయ విచారణ కమిషన్ రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించింది. టీటీడీ, రుయా, స్విమ్స్, పోలీసు అధికారులను కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి వేర్వేరుగా విచారించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, టీటీడీ ఈవో శ్యామలరావు, రుయా, స్విమ్స్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు సమన్లు జారీ చేశారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఉదయం టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ లా ఆఫీసర్ వరప్రసాద్, దేవస్థానానికి చెందిన మరో నలుగురు విభాగ అధికారులతో కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లకు సంబంధించి ముందస్తుగా నిర్వహించిన సమావేశం మినిట్స్ గురించి, ఏయే శాఖ లు, విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాలు పెట్టారన్న అం శాలపై ఈవోను జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. టోకెన్ల కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపునకు సంబంధించిన వివరాలపై ఆరాతీశారు. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద ఏం జరిగింది? పోలీసుశాఖతో సమన్వయం చేసుకున్నారా? వంటి ప్రశ్నలు వేశారు. వాటికి సంబంధించిన రికార్డులను కమిషన్ పరిశీలన నిమిత్తం టీటీడీ అధికారు లు అందజేశారు. సుమారు 2గంట ల పాటు కమిషన్ టీటీడీ అధికారులను విచారించింది.
అనంతరం రు యాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ శశికాంత్, ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రావతి, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తి, నర్సింగ్ అధికారులను కమిషన్ విచారించింది. రుయాస్పత్రి నుంచీ మెరుగైన చికిత్స కోసం స్విమ్స్ ఆస్పత్రికి ఎంతమందిని తరలించారు? రుయాస్పత్రిలో మృతులు ఎందరు? వారికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికల ప్రతులు అందజేయాలని ఆదేశించారు. అనంతరం స్విమ్స్ వైద్య సంస్థ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కమిషన్ ఎదుట హాజరు కాగా ఆయన్ను కూడా ప్రశ్నించింది. చివరగా జిల్లా లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవిమనోహరాచారి విచారణకు హాజరయ్యారు. టోకెన్ల జారీ కేంద్రం వద్ద బందోబస్తు, క్యూలైన్ల ఏర్పా ట్లు, బ్యారికేడ్ల వంటి అంశాలపై ప్రశ్నించి సమాధానా లు రికార్డు చేశారు. టోకెన్ల జారీ కేంద్రం రామానాయుడు స్కూలు ఆవరణలో ఉండగా భక్తులను పద్మావతి పార్కులోకి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. కాగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, రెవెన్యూ అధికారులు సోమవారం విచారణకు హాజరయ్యే అవకాశముంది.
ఇకపై ప్రతినెలా చివరి మంగళవారంటీటీడీ బోర్డు సమావేశం
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఇకపై ప్రతినెలా చివరి మంగళవారం సమావేశం కానుంది. సాధారణంగా అభివృద్ధి, సౌకర్యాల కల్పన, ఉత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లు వంటి వాటిపై అవసరాన్ని బట్టి బోర్డు సమావేశాలు జరుగుతుంటాయి. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాలు సమర్థంగా పనిచేయడంతో పాటు భక్తులకు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం కోసం ప్రతినెలా బోర్డు సమావేశాన్ని నిర్వహించి తీర్మానాలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇకపై ప్రతినెలా చివరి మంగళవారం బోర్డు సమావేశాలను నిర్వహించేందుకు చైర్మన్ బీఆర్ నాయుడు సిద్ధమయ్యారు. దీనికి తగ్గట్టుగా ప్రతినెలా అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అఽధికారులను చైర్మన్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News