Tirupati News: తిరుమల అతిథి గృహంలో కోడిగుడ్లు, చికెన్ చూశా..
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:41 AM
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా మరో వివాదానికి వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు. తిరుమల అతిథి గృహంలో కోడిగుడ్లు, చికెన్ చూశా.. అని సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేత పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేత వీడియో వైరల్
తిరుమల: తిరుమలలోని ఓ విశ్రాంతిగృహంలో తాను కోడిగుడ్లు, చికెన్ ఉన్నట్టు గుర్తించానని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఓ వైసీపీ నేత విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘శ్రీనివాస్ నాయక్ అనే నేను వైసీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిని. 17వ తేదీన తిరుమలలోని కౌస్తభం విశ్రాంతి భవనంలో 538 నెంబరు గదిని అద్దెకు తీసుకున్నా. అక్కడికి వెళ్లే సమయంలో పారిశుధ్య కార్మికులు గదిని శుభ్రపరిచి చికెన్, కోడిగుడ్లు ఉన్న ఓ కవర్‌ను బయట పడేయడాన్ని గుర్తించా. లడ్డూలో కల్తీ జరిగిందని నానా రోత చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ చైర్మన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఈ విషయాన్ని మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తా’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఆ వీడియోలో కోడిగుడ్లు కానీ, చికెన్ కానీ కనిపించకపోవడం గమనార్హం.

నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు: టీటీడీ
538 గదిలోకి కొందరు యాత్రికులు నిషేధిత వస్తువులైన కోడి గుడ్లను తెచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన ద్వారా స్పందించింది. కోడిగుడ్లను తెచ్చిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!
బ్యాంకింగ్ వదిలి చాక్లెట్ మేకింగ్
Read Latest Telangana News and National News