Share News

Pallavi Veds Inspiring Journey: బ్యాంకింగ్‌ వదిలి చాక్లెట్‌ మేకింగ్‌

ABN , Publish Date - Dec 20 , 2025 | 06:45 AM

అమ్మానాన్నల కోరిక మీద ఎంబీయే చదివారు. బ్యాంకులో ఉద్యోగం... ఉన్నత హోదా... కానీ ఎక్కడో వెలితి... చిన్నపాటి అసంతృప్తి. అదే ఆమెను అనూహ్యంగా పారిశ్రామికవేత్తను చేసింది....

Pallavi Veds Inspiring Journey: బ్యాంకింగ్‌ వదిలి చాక్లెట్‌ మేకింగ్‌

అభిరుచి

అమ్మానాన్నల కోరిక మీద ఎంబీయే చదివారు. బ్యాంకులో ఉద్యోగం... ఉన్నత హోదా... కానీ ఎక్కడో వెలితి... చిన్నపాటి అసంతృప్తి. అదే ఆమెను అనూహ్యంగా పారిశ్రామికవేత్తను చేసింది.

కొలువు వదిలి... కోటిన్నర టర్నోవర్‌ గల చాక్లెట్‌ కంపెనీకి అధిపతిగా... మహిళలకు ఉపాధి మార్గంగా మారిన పల్లవి వేద్‌ ప్రయాణం ఇది.

‘‘సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నాకు పెద్దగా కోరికలు ఏవీ ఉండేవి కావు. ఏదో అయిపోవాలని కలలూ కనలేదు. అమ్మానాన్నలు చూపించిన దారిలో ఆడుతూ పాడుతూ సాగిపోయింది... నా బాల్యం, విద్యాభ్యాసం. ముంబయి మా స్వస్థలం. నన్ను బాగా చదివించి, మంచి ఉద్యోగంలో చూడాలనే ఒక సగటు తల్లిదండ్రుల ఆశ మా పెద్దలది కూడా. దానికి తగ్గట్టుగానే స్థానిక ‘నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీ్‌స’లో ఎంబీయే చేశాను. ఆ వెంటనే, అంటే 1999లో ‘గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌’ లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా చేరాను. తరువాత ‘స్కాటియా బ్యాంక్‌’లో అకౌంట్స్‌ ఆఫీసర్‌గా అవకాశం వచ్చింది. అయితే అక్కడ ఎక్కువ కాలం లేను. ఐసీఐసీఐ బ్యాంకులో సొల్యూషన్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టాను. నాలుగున్నరేళ్లలో రీజినల్‌ హెడ్‌ హోదాకు వెళ్లాను.

రూటు మార్చిన పర్యటన...

అనుకున్నదాని కంటే వేగంగా కెరీర్‌లో దూసుకుపోతున్నాను. కానీ ఎక్కడో ఏదో వెలితి. నేను ఎప్పుడూ సృజనాత్మకంగా ఆలోచిస్తుంటాను. ఉద్యోగంలో పడ్డాక నాలోని ఆ సృజనకు దారులు మూసుకుపోయాయి. అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన నన్ను కుదురుగా కూర్చోనివ్వలేదు. మరి ఏంచేయాలి? దానిపై స్పష్టత లేదు. ఒకసారి కుటుంబంతో కలిసి స్విట్జర్‌ల్యాండ్‌ వెళ్లాను. అక్కడి ఓ చాక్లెట్‌ షాపులో అడుగుపెట్టాను. అప్పట్లో భారత్‌లో రెండు మూడు చాక్లెట్‌ బ్రాండ్లు మాత్రమే ఉండేవి. ఆ షాపులోకి వెళ్లాకనే తెలిసింది... అసలైన చాక్లెట్‌ ఎలా ఉంటుందో! నోట్లో వేసుకొని చప్పరించేది మాత్రమే కాదు... అది ఒక కళాఖండం. దాని వెనుక ఒక కళాత్మక హృదయం దాగి ఉంటుందని అర్థమైంది. ఆ అద్భుతం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఆ క్షణమే నిర్ణయించుకున్నా... నా భవిష్యత్తు ఇందులోనే అని.


ఉద్యోగం వదిలి...

బ్యాంకుకు వెళుతూనే చాక్లెట్లలోని రకాలు, వాటి తయారీ గురించి పరిశోధన మొదలుపెట్టా. ఆ సమయంలో నేను గర్భవతిని. కొద్ది రోజుల్లో వృత్తిలో పదోన్నతి. అలాంటి సమయంలో ఉద్యోగం వదిలేద్దామని నిశ్చయించుకున్నా. అదికూడా ఏ మాత్రం అనుభవంలేని చాక్లెట్‌ తయారీ కోసం. మా బాస్‌కు చెబితే... ‘ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? అలా ఎలా వదిలేస్తావ్‌’ అంటూ మందలించారు. ‘సర్‌... మీరు చెప్పింది నిజమే. కానీ నాకంటూ ఒక అభిరుచి ఉంది. కొత్తగా ఏదైనా సాధించాలనే తపన ఉంది. ఉద్యోగం... వచ్చే జీతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను అనుకున్నది ఎప్పటికీ సాధించలేను’ అని బాస్‌కు బదులిచ్చి, రాజీనామా చేశాను. నా నిర్ణయానికి ఇంట్లోవాళ్లు అవాక్కయ్యారు. నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఎవరినీ పట్టించుకోలేదు. చాక్లెట్‌ తయారీకి సంబంధించి అప్పట్లో చాలా తక్కువ కోర్సులు అందుబాటులో ఉండేవి. అవే నేర్చుకున్నా. 2011లో ‘వెల్వెట్‌ ఫైన్‌ చాక్లెట్స్‌’ పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాను.

ఇంటి నుంచే...

చాలా తక్కువ పెట్టుబడితో మా ఇంటి వంట గదిలోనే చాక్లెట్‌ తయారీ మొదలుపెట్టాను. ఇద్దరు మహిళలను హెల్పర్స్‌గా తీసుకున్నాను. చిన్న చిన్న ఆర్డర్లు వచ్చేవి. ఆ రోజుల్లో తక్కువ ఖర్చులో ప్రజల్లోకి వెళ్లాలంటే ‘జస్ట్‌ డయల్‌’ ఒక్కటే ఉండేది. అందులో మా బిజినెస్‌ లిస్ట్‌ అయ్యాక... క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. దాంతో కిచెన్‌ నుంచి వేరే ప్రాంతానికి కంపెనీని మార్చాల్సివచ్చింది. ఇంట్లో అమ్మానాన్న వద్దని వారించినా... మావారు మాత్రం ఆ రోజు నుంచి నేటి వరకు నాకు మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. ఆయన ప్రోత్సాహం మరువలేనిది. ఆర్డర్లపైనే కాకుండా... ఆన్‌లైన్‌లో కూడా చాక్లెట్లు విక్రయిస్తున్నాం. సాధారణంగా మనం తినేవాటికి భిన్నంగా ఉంటాయి... యూరోపియన్‌ చాక్లెట్లు. ఆ స్ఫూర్తితోనే ప్రతి బైట్‌లో విభిన్నమైన రుచిని అందించాలని ప్రయత్నిస్తున్నా.


సవాళ్లు ఎన్నో...

ఆరంభంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. నేను చెఫ్‌ను కాదు. చిన్నప్పుడు విపరీతంగా చాక్లెట్లు తిన్నదాన్నీ కాదు. నా వద్ద పని చేసేవారికీ అనుభవం లేదు. వీటన్నిటివల్ల చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నిటినీ అధిగమించి నేడు కోటిన్నర టర్నోవర్‌ సాధించగలిగానంటే... అది మా టీమ్‌ శ్రమ ఫలితం. నా ప్రయాణంలో వాళ్లూ భాగస్వాములు. ఇప్పుడు మా కంపెనీలో పాతికమంది పని చేస్తున్నారు. అందరూ మహిళలే.’’

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 06:45 AM