Tirumala: యువతకు టీటీడీ గోల్డెన్ చాన్స్.. నేరుగా శ్రీవారి దర్శనం
ABN , Publish Date - May 13 , 2025 | 10:46 AM
TTD: యువతకు టీటీడీ లక్కీ చాన్స్ ఇస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మరి.. ఆ బంపర్ చాన్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

యువతకు బంపర్ చాన్స్ ఇస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామని నేరుగా దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. అయితే ఇందుకోసం వాళ్లు ఓ పని చేయాల్సి ఉంటుంది. సనాతన ధర్మం మీద యువతలో మరింత అనురక్తిని కల్పించే ఉద్దేశంతో రామకోటి తరహాలో గోవిందకోటిని 2 ఏళ్ల కింద ప్రవేశపెట్టింది టీటీడీ. గోవిందకోటి రాసిన యువతకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తూ వస్తోంది. 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు దీనికి అర్హులు. 10,01,116 సార్లు గోవిందనామాలు రాసిన వారు వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా నేరుగా శ్రీవారిని చూసి తరించొచ్చు. కోటిసార్లు గోవిందనామాలు రాస్తే వారితో పాటు కుటుంబ సభ్యులంతా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు.
ఎంత సమయం పడుతుందంటే..
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రాలతో పాటు పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్‌లోనూ గోవిందకోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కోటి నామాల పుస్తకాన్ని పూర్తి చేయడానికి కనీసం 3 ఏళ్ల సమయం పడుతుందని టీటీడీ అంచనా వేసింది. 200 పేజీలు ఉండే దాదాపు 26 పుస్తకాలు అవసరమవుతాయని తెలిపింది. తిరుమలలోని టీటీడీ పేష్కార్ ఆఫీసులో గోవిందకోటి నామాల పుస్తకాన్ని అందిస్తే ఆ తర్వాతి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తామని పేష్కార్ రామకృష్ణ తెలిపారు. కాగా, తొలిసారిగా గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తి చేసిన కర్ణాటకకు చెందిన కీర్తనకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించింది. ఆ తర్వాత మరో ఇద్దరు గోవిందకోటి నామాలను రాసి ఇదే విధంగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:
ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్: పవన్
ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ఉపేక్షించం
మరిన్ని ఏపీ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి