Share News

KA Paul-Suprem Court: ప్రచారం కోసం సుప్రీంకోర్టుకు రావొద్దు.. కేఏ పాల్‌కి అత్యున్నత న్యాయస్థానం చివాట్లు!

ABN , Publish Date - Nov 10 , 2025 | 04:09 PM

కేఏ పాల్ మీద సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని మీడియాలో ప్రచారం కోసం వాడుకోవద్దనేలా సూచనలు చేసింది. ఈ మేరకు జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

KA Paul-Suprem Court: ప్రచారం కోసం సుప్రీంకోర్టుకు రావొద్దు.. కేఏ పాల్‌కి అత్యున్నత న్యాయస్థానం చివాట్లు!
KA Paul-Suprem Court

ఢిల్లీ, నవంబర్, 10: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్‌ మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారని జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో మరో మారు కేఏ పాల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైనట్లైంది.

ఇక, కేసు వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పీపీపీ మోడ్‌లో పూర్తి చేసి నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేఏ పాల్‌.. సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై కేఏ పాల్‌పై అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని కేఏ పాల్‌కు సూచించింది.


కాగా, ఇప్పటికే కేఏ పాల్ అనేక అంశాల్లో చాలా సార్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, కేఏ పాల్‌ వేసిన చాలా పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుత పిటిషన్ తరహాలోనే 2024లో తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీం కోర్టులో పాల్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం.. పిటిషన్ డిస్మిస్ చేసింది.

ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) బదులు.. బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ 2024లో కేఏ పాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. 2023లో తెలంగాణ సెక్రటేరియట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరిపించాలా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది.


ఇవీ చదవండి:

వణికిస్తున్న కాలుష్యం.. ఢిల్లీ‌కి వెళ్లే విమానం దాదాపుగా ఖాళీ!

టాక్సీ బుకింగ్.. జర్మనీ టూరిస్టులకు గోవాలో ఇక్కట్లు

Read Latest and Viral News

Updated Date - Nov 10 , 2025 | 04:17 PM