Empty Delhi Bound Flight: వణికిస్తున్న కాలుష్యం.. ఢిల్లీకి వెళ్లే విమానం దాదాపుగా ఖాళీ!
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:14 PM
కాలుష్యమయంగా మారిన ఢిల్లీకి వెళ్లేందుకు జనాలు భయపడుతుండటంతో ప్రయాణికులు లేక వెలవెలబోయిన ఢిల్లీ విమానం తాలూకు చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ మహిళ ఈ ఫొటోలను నెట్టింట పోస్టు చేసింది. ఇది చూసి జనాలు షాకయిపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆదివారం ఢిల్లీలో వాయు కాలుష్యం పీక్స్‌కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ ఏకంగా 400 మార్కును తాకింది. దీంతో, ప్రజలు ఇక్కట్లపాలయ్యారు. కాలుష్యానికి భయపడి ఇతర ప్రాంతాల వారు ఢిల్లీ వెళ్లేందుకు సాహసించట్లేదు. పరిస్థితి ఎంత షాకింగ్‌గా ఉందో చెబుతూ ఓ మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Delhi Air Pollution Empty fight).
ఢిల్లీకి బయలుదేరిన ఓ మహిళ తాను ప్రయాణిస్తున్న విమానంలో పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ఈ పోస్టు పెట్టారు. ‘ఢిల్లీలో గాలి నాణ్యత ఎంతగా పడిపోయిందంటే ఒక్కరు కూడా ఢిల్లీ వెళ్లేందుకు సాహసం చేయట్లేదు. నేనున్న విమానంలో కేవలం పది మందే ఉన్నారు. వారాంతాల్లో ఢిల్లీ విమానం ప్రయాణికులు లేక ఇంతగా వెలవెలబోవడం నేను ఇప్పటివరకూ చూడలేదు’ అని ఆమె పోస్టు పెట్టారు.
ఆదివారం ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయిలు ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. గాలి నాణ్యత సూచీ 392కు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో 400 మార్కు దాటింది. కాలుష్యం కారణంగా ఇప్పటికే ఢిల్లీని అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఢిల్లీ వాసులు ఎన్95 మాస్కులు వాడాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతే తప్ప ఇంటి గడప దాటొద్దని పేర్కొంది.
వాహనాలు, పరిశ్రమల ఉద్గారాలు, వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం, గాలిలో చలనం తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగింది. ఇక గాలి నాణ్యత సూచీ 400 దాటితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు (AQI Index Delhi).
ఈ పరిస్థితిపై నెట్టింట పెద్ద ఎత్తున జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కొలువైన ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని ఓ నెటిజన్ ఆవేదనతో ప్రశ్నించాడు. విమానం ఇంత ఖాళీగా ఉండటం తామూ ఎప్పుడూ చూడలేదని అనేక మంది అన్నారు.
ఇవీ చదవండి:
టాక్సీ బుకింగ్.. జర్మనీ టూరిస్టులకు గోవాలో ఇక్కట్లు
మనపై అకారణంగా ఆగ్రహం.. అమెరికాలో భారత సంతతి మేనేజర్ పోస్టు వైరల్