US Tech Sector Backlash: మనపై అకారణంగా ఆగ్రహం.. అమెరికాలో భారత సంతతి మేనేజర్ పోస్టు వైరల్
ABN , Publish Date - Nov 09 , 2025 | 07:20 PM
అమెరికా టెక్ రంగంలో భారతీయులు అకారణంగా జనాగ్రహానికి టార్గెట్ అవుతున్నారంటూ ఓ ఎన్నారై మేనేజర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆయన పరిస్థితిపై అనేక మంది సంఘీభావం తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా టెక్ రంగంలోని భారతీయులపై వ్యతిరేకత పెరుగుతుండటంతో ఓ ఎన్నారై నెట్టింట తన ఆవేదనను పంచుకున్నారు. భారతీయులను అన్యాయంగా టార్గెట్ చేస్తున్నారని పోస్టు పెట్టారు. వృత్తినిపుణులు అజ్ఞాతంగా తమ అభిప్రాయాలను పంచుకునే బ్లైండ్ సైట్‌లో ఆయన ఈ పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది (US Tech Sector H-1b Issues).
‘టెక్ రంగంలో భారతీయులపై ఈ మధ్య ఆగ్రహం పెరగటాన్ని నేను గమనిస్తున్నాను. ఆన్‌లైన్ వేదికల్లో కూడా ఈ పోకడలు ఎక్కువ అవుతున్నాయి. మనం భారతీయులనే ఎంపిక చేసుకుంటామని అంటున్నారు. కుల వ్యవస్థను కూడా ఇక్కడకు తీసుకొచ్చామని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే నా మనసంతా ఆవేదనతో నిండిపోతోంది. నా కెరీర్ మొత్తం నేను విలువలతో ముందుకు సాగాను’ అంటూ విచారం వ్యక్తం చేశారు.
వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులకు తాను మార్గదర్శకత్వం చేశానని ఆయన చెప్పారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపట్టానని అన్నారు. కానీ భారతీయులపై ఉన్న ఈ తప్పుడు అభిప్రాయం కారణంగా తనపై ప్రభావం పడుతోందని చెప్పారు. ‘నా సోషల్ సర్కిల్‌ను విస్తృత పరుచుకునేందుకు అమెరికాకు వచ్చా. కానీ నా ఫ్రెండ్స్‌లో అధిక శాతం మంది భారతీయులే’ అని చెప్పారు.
ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆయన పరిస్థితిపై సంఘీభావం తెలిపారు. జాతీయత, వీసా స్థితిని బట్టి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్-1బీ వీసా వ్యవస్థ దుర్వినియోగం అవుతోందన్న భావన అమెరికన్లలో ఉన్న విషయం తెలిసిందే. నియామకాల్లో వివక్ష కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో, హెచ్-1బీ వీసాదారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
ఇవీ చదవండి:
నగల వ్యాపారి చేతిలో మహిళకు దేహశుద్ధి.. వీడియో వైరల్
మెక్‌డోనల్డ్స్ మేనేజర్‌పై వేడి వేడి కాఫీని విసిరేసిన కస్టమర్.. షాకింగ్ వీడియో