Ahmedabad Jewellery Theft: నగల వ్యాపారి చేతిలో మహిళకు దేహశుద్ధి.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 07 , 2025 | 06:37 PM
నగల షాపులో చోరీకి వచ్చిన ఓ మహిళకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్న షాపులోని వ్యక్తి పలు మార్లు నిందితురాలి చెంప ఛెళ్లుమనిపించాడు. అహ్మదాబాద్‌లో ఈ ఉదంతం వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: జువెలరీ షాపులో చోరీకి యత్నించిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. షాపులోని వ్యక్తి ఆమెను పలుమార్లు చెంప ఛెళ్లుమనిపించడంతో దెబ్బలు తాళలేక అల్లాడిపోయింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Ahmedabad Jewellery Theft- Viral Video).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, రానిప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖానికి దుపట్టా అడ్డం పెట్టుకున్న నిందితురాలు కస్టమర్‌లా నటిస్తూ షాపులోకి వచ్చింది. షాపు కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తి ఏమరపాటుగా ఉన్న సమయంలో అతడి కళ్లల్లో కారం చల్లి నగలను ఎత్తుకుపోవాలనేది ఆమె ప్లాన్. కానీ, ఈ పథకం ఊహించని రీతిలో వికటించింది.
నిందితురాలు కారం చల్లినా వెంటనే తప్పించుకున్న అతడు కోపంతో ఊగిపోయాడు. ఆమె పారిపోకుండా గట్టిగాపట్టుకుని పలుమార్లు చెంప ఛెళ్లుమనిపించాడు. 20 సెకెన్ల వ్యవధిలోనే 17 సార్లు ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెను షాపులోంచి గెంటేశాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. పోలీసులు వచ్చే లోపే మహిళ పరారవ్వడంతో నిందితురాలి కోసం వారు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఇవీ చదవండి:
రాబోయే 7 రోజులు ఇలా చేసి చూడండి... మీ లైఫ్ మారిపోతుంది
చుక్కలు చూపిస్తున్న అమెరికా... రూ. కోటి శాలరీ ఉన్న టెకీకి ఊహించని షాక్