US Visa Woes: చుక్కలు చూపిస్తున్న అమెరికా... రూ. కోటి శాలరీ ఉన్న టెకీకి ఊహించని షాక్
ABN , Publish Date - Nov 02 , 2025 | 02:51 PM
అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఊహించని షాక్ తగిలింది. తన ఆవేదనను నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ట్రంప్ సర్కారు వలసలపై ఉక్కుపాదం మోపుతోంది. విదేశీయులను అమెరికాలో కాలుపెట్టకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ నిబంధనల ఫలితంగా ఇక్కట్ల పాలైన ఓ టెకీ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్వయంగా ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. అమెరికాలో ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు బీ1-బీ2 వీసాకు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పాడు. కానీ ఊహించని విధంగా తన దరఖాస్తు తిరస్కరణకు గురైందని ఆవేదన వ్యక్తం చేశాడు (Indian Techie US Visa Rejection).
ఇతర దేశాలు వారు అమెరికాలోనే ఉండిపోతారని ఏమాత్రం అనుమానం కలిగినా అధికారులు వీసా తిరస్కరిస్తున్నారు. కానీ తనకు అలాంటి ఉద్దేశం ఏమీ లేకపోయినా వీసా దక్కలేదని సదరు టెకీ ఆవేదన వ్యక్తం చేశారు. వీసా ఇంటర్వ్యూలో కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే అడిగారని తెలిపారు. అమెరికాలో స్నేహితులు బంధువులు ఉన్నారా అని అడగ్గా లేరని చెప్పానని అన్నారు. చివరకు వీసా తిరస్కరించడంతో షాకయ్యానని అన్నారు. అసలేం జరిగిందో కూడా అర్థం కాలేనదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఇండియాలోనే మంచి ఉద్యోగం, రూ. కోటి శాలరీ, కుటుంబం స్నేహితులు అన్నీ ఉన్నాయని చెప్పారు. అమెరికాలో సెటిల్ అవ్వాల్సిన అవసరమే లేదని అన్నారు. అయినా వీసా దక్కకపోవడం ఆశ్చర్యాన్ని, నిరాశను కలిగించాయని చెప్పారు. ‘ఆ కాన్ఫరెన్స్ నాకు ఎంతో ముఖ్యం. దాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేసే అవకాశం కూడా లేదు. అందుకే ముందుగా అనేక ఏర్పాట్లు చేసుకున్నా. కానీ చివరి నిమిషంలో అంతా తలకిందులైంది’ అని వాపోయారు. ఇక ఈ ఉదంతంపై అనేక మంది విచారం వ్యక్తం చేశారు. ఈ మధ్య తరచూ ఇలాగే జరుగుతోందని కొందరు అన్నారు.
ఇవీ చదవండి:
వేల మందికి లేఆఫ్స్ ముప్పు.. వణికిపోతున్న అమెజాన్ ఉద్యోగులు
వివాహితతో ఎఫైర్.. ఆమె భర్తకు లవర్ పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు