McDonald Worker Attacked: మెక్‌డోనల్డ్స్ మేనేజర్‌పై వేడి వేడి కాఫీని విసిరేసిన కస్టమర్.. షాకింగ్ వీడియో
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:58 PM
అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గంట ఆలస్యంగా కాఫీ సర్వ్ చేశారంటూ రెచ్చిపోయిన ఓ కస్టమర్ మెక్‌డోనల్డ్స్ మేనేజర్‌పై వేడి వేడి కాఫీని విసిరికొట్టింది. నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మెక్‌డోనల్డ్స్ షాపులో గంట ఆలస్యంగా కాఫీ ఇచ్చినందుకు కోపంతో ఊగిపోయిన ఓ మహిళా కస్టమర్.. స్టోరు మేనేజర్‌పై వేడి వేడి కాఫీని విసిరేసింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోగల బ్యూనో విస్టా నగరంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితురాలిని 48 ఏళ్ల కషారా బ్రౌన్‌గా పోలీసులు గుర్తించారు (Customer throws Hot Coffee At Manager).
తొలుత కషారా.. షాపు మేనేజర్‌తో వాగ్వాదానికి దిగింది. కాఫీ కోసం గంట సేపు వేచి చూడాల్సి వచ్చిందని పేర్కొంది. త్వరగా ఇస్తానని చెప్పి మాటతప్పిన అబద్ధాలకోరువంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రౌన్ అదేపనిగా వాగ్యుద్ధానికి దిగుతుండటంతో చివరకు మేనేజర్ విసిగిపోయింది. ‘మీ కాఫీ మీకు వచ్చింది. రీఫండ్ కావాలనుకుంటే మాత్రం 48 గంటలు వేచి చూడాలి’ అని చెప్పి కషారా సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్లిపోయింది (McDonald's Incident).
ఈ క్రమంలో మరింతగా రెచ్చిపోయిన కషారా ఒక్కసారిగా కౌంటర్‌పై నుంచి ముందుకు వంగి మేనేజర్‌పై కాఫీ విసిరింది. వేడి వేడి కాఫీ పడటంతో అల్లాడిపోయిన మేనేజర్ గగ్గోలు పెట్టింది. అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలను పోలీసులు నెట్టింట పంచుకున్నారు. నిందితురాలి వివరాలు చెప్పాలని ప్రజలను కోరడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘దాదాపు 100కు పైగా కాల్స్ వచ్చాయి. రెండు నిమిషాల్లో ఆమె వివరాలు మాకు తెలిసిపోయాయి’ అని బ్యూనో విస్టా పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఇక వీడియో వైరల్ కావడంతో జనాలు కషారా బ్రౌన్‌పై మండిపడుతున్నారు. తన పేరు, ఫోన్ నెంబర్‌తో ఆర్డరిచ్చి ఆపై ఇలా దాడిచేస్తే పోలీసులకు దొరికిపోరా? ఇవేమి తెలివితేటలో! అని కొందరు వీడియోపై కామెంట్ చేశారు.
ఇవీ చదవండి:
నగల వ్యాపారి చేతిలో మహిళకు దేహశుద్ధి.. వీడియో వైరల్
ఆంజనేయస్వామి దయ.. కూరగాయల వ్యాపారికి రూ.11 కోట్ల లాటరీ