Vegetable Vendor Wins Lottery: ఆంజనేయస్వామి దయ.. కూరగాయల వ్యాపారికి రూ.11 కోట్ల లాటరీ
ABN , Publish Date - Nov 07 , 2025 | 10:01 PM
రాజస్థాన్‌కు చెందిన ఓ వీధి వ్యాపారికి అదృష్టం ఊహించని విధంగా వరించింది. అప్పు చేసి లాటరీ టిక్కెట్ కొంటే ఏకంగా రూ.11 కోట్లు దక్కాయి.
ఇంటర్నెట్ డెస్క్: పేదరికంలో మగ్గుతున్న ఓ వీధి వ్యాపారి జీవితం తాజాగా అనూహ్య మలుపు తిరిగింది. అప్పు చేసి మరీ కొన్న లాటరీ టిక్కెట్ అతడిని రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని చేసింది. తాను నమ్మిన ఆంజనేయ స్వామి దయవల్లే తన జీవితం మారిపోయిందని అతడు సంబరపడుతూ చెప్పుకొచ్చాడు (Amit Sehra Lottery Winner).
రాజస్థాన్‌కు చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా ఇటీవల పంజాబ్ స్టేట్ లాటరీలో దిపావళి బంపర్ డ్రా గెలుచుకున్నాడు. ఏకంగా రూ.11 కోట్లను సొంతం చేసుకున్నాడు. అప్పటివరకూ పేదరికంలో అలమటిస్తున్న అతడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. వాస్తవానికి అతడో చిరు వ్యాపారి. వీధి పక్కన బండి పెట్టుకుని కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాడు. ఇటీవల పంజాబ్‌లోని భటిండాకు వెళ్లిన సమయంలో లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశాడు. తన స్నేహితుడి వద్ద అప్పుగా తీసుకున్న వెయ్యి రూపాలయతో తన కోసం, తన భార్య కోసం రెండు టిక్కెట్లను కొనుగోలు చేశాడు. అతడి భార్య టిక్కెట్‌పై రూ.1000 లాటరీ వస్తే అతడికి మాత్రం ఏకంగా రూ.11 కోట్ల బంపర్ లాటరీ తగిలింది.
‘నేను ఎంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నేను ఆంజనేయస్వామినే నమ్ముకున్నాను. ఆయన కటాక్షంతోనే నా దశ తిరిగింది. పంజాబ్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. విధి అంటే ఇదేనేమో’ అని సంబరపడిపోతూ చెప్పాడు.
తనకు అప్పు ఇచ్చిన స్నేహితుడి కూతుళ్లు ఇద్దరికీ చెరో రూ.50 లక్షలు ఇస్తానని అమిత్ మీడియాకు తెలిపాడు. మిగతా సొమ్ముతో తానో ఇల్లు కట్టుకుంటానని కూడా చెప్పాడు. అమిత్ లాటరీ గెలుచుకున్నట్టు పంజాబ్ అధికారులు కూడా ధ్రువీకరించారు. నవంబర్ 4న అతడు భటిండాకు కుటుంబంతో సహా వచ్చి ప్రైజ్‌ను క్లెయిమ్ చేసుకున్నాడని తెలిపారు.
ఇవీ చదవండి:
నగల వ్యాపారి చేతిలో మహిళకు దేహశుద్ధి.. వీడియో వైరల్
చుక్కలు చూపిస్తున్న అమెరికా... రూ. కోటి శాలరీ ఉన్న టెకీకి ఊహించని షాక్