German Tourists in Goa: టాక్సీ బుకింగ్.. జర్మనీ టూరిస్టులకు గోవాలో ఇక్కట్లు
ABN , Publish Date - Nov 09 , 2025 | 09:46 PM
గోవాలో క్యాబ్ ద్వారా ట్యాక్సీ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఇద్దరు జర్మనీ టూరిస్టులు ఇక్కట్లు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఉదంతంపై జనాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గోవా టూరిజంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: గోవాలో యాప్ ద్వారా ట్యాక్సీ బుక్ చేసుకునే క్రమంలో జర్మనీ టూరిస్టులు ఇద్దరు ఇక్కట్ల పాలైన ఘటన ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇలాంటి ఘటనలతో భారత్‌కు చెడ్డ పేరు వస్తుందంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (German Tourists' troubles in Goa).
అలెక్స్ వీల్డర్ అనే జర్మనీ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ వీడియోను పోస్టు చేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. స్థానికంగా ఉన్న ఆటోకు బదులు యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. ఆటోవాలాలు రూ.500 అడిగితే యాప్‌లో క్యాబ్ మాత్రం కేవలం రూ.300కే వచ్చిందని అన్నారు. ఓ ఆటో డ్రైవర్ తమనే ఫాలో కావడంతో కొంత దూరం వెళ్లాకే ట్యాక్సీ బుక్ చేసుకోగలిగామని అన్నారు.
ఇక క్యాబ్‌లో వెళ్లాక పోలీసులు తమ కారును ఆపారని అలెక్స్ వీల్డర్ తెలిపారు. వారు డ్రైవర్‌ను రూ.500 కట్టమని అడిగారని చెప్పారు. చివరకు డ్రైవర్ చెల్లించాల్సిన డబ్బులు తానే ఇచ్చానని అన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తనకు అర్థం కాలేదని తెలిపారు. ఈ వీడియోపై అనేక మంది కామెంట్ చేశారు. ఇలాంటి ఘటన వల్ల గోవా పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గోవాలో ఇలాంటి ఘటనల తాలూకు వీడియో గతంలో కూడా వైరల్‌గా మారాయి. యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకోవద్దంటూలోకల్ డ్రైవర్లు తమను ఒత్తిడి చేస్తున్నారని కొందరు భారతీయులు కూడా నెట్టింట ఫిర్యాదు చేశారు. గోవామైల్స్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకునేందుకు ముంబైకి చెందిన ఓ మహిళ దాదాపు 1 కిలోమీటరు మేర లగేజీని మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఈ ఉదంతంపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఇవీ చదవండి:
మనపై అకారణంగా ఆగ్రహం.. అమెరికాలో భారత సంతతి మేనేజర్ పోస్టు వైరల్
నగల వ్యాపారి చేతిలో మహిళకు దేహశుద్ధి.. వీడియో వైరల్