Govt Schemes For Girls : ఆడపిల్లల భవిష్యత్తుకు.. ప్రభుత్వం తీసుకొచ్చిన 5 పథకాలు..
ABN , Publish Date - Jan 24 , 2025 | 08:24 PM
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ 5 పథకాలు బాలికల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడతాయి. మరి, ఈ పథకాలు ఏమిటి? వాటి వల్ల ఆడపిల్లలు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోండి..
బాలికా శిశు దినోత్సవం 2025: ఈ రోజు జాతీయ బాలికా దినోత్సవం. 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి ఆడపిల్లలను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఏటా జాతీయ బాలికల శిశు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, వారి భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాలికల కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు ప్రయోజనకరమైన పథకాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. పథకాల పేర్లు, కలిగే ప్రయోజనాలు, ఎలా పొందాలని అన్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బాలికల కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న 5 పథకాలు..
బేటీ బచావో బేటీ పఢావో పథకం
బాలికల లింగ నిష్పత్తిని పెంచడానికి, బాలికల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారు సమాజంలో సమాన భాగస్వామ్యం పొందడానికి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 2015లో హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న బాలికలందరికీ వర్తిస్తుంది. బేటీ బచావో బేటీ పడావో పథకం కింద బాలికలకు చదువుపై అవగాహన కల్పిస్తారు. ఆడపిల్లల భ్రూణహత్యల నివారణకు కూడా ఈ పథకం ఎంతగానో దోహదపడింది.
సుకన్య సమృద్ధి యోజన
భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఆడపిల్లల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో పొదుపు పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈ పథకం కింద బాలిక తల్లిదండ్రులు లేదా సంరక్షకులు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం బ్యాంకు ఖాతాను తెరుస్తారు. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తానికి మంచి వడ్డీ లభిస్తుంది. దీని వల్ల ఆడపిల్లల పెళ్లికి, ఉన్నత చదువుల కోసం మంచి ఫండ్ సేకరించవచ్చు.
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పథకం
ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 1997లో ప్రారంభించింది. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో బాలికల విద్యను ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశం. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందిస్తారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీ వర్గాల బాలికలకు ప్రయోజనాలు దక్కుతాయి.
బాలికల సమృద్ధి యోజన
ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2004లో ప్రారంభించింది. బాలికలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యం. ఆడపిల్లలకు ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. అంతే కాకుండా చదువుకునే సమయంలో తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కూడా బాలికలకు ప్రోత్సాహకంగా నగదు అందజేస్తున్నారు.
ఉచిత సైకిల్ పథకం
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా అమలు చేయలేదు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఈ పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లను అందజేస్తుంది. తద్వారా వారు పాఠశాలకు వెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.