Pawan Kalyan: కురుపాం విద్యార్థినిల మృతి బాధాకరం.. త్వరలో పరామర్శకు పవన్
ABN , Publish Date - Oct 05 , 2025 | 09:54 PM
మృతిచెందిన విద్యార్థినిల కుటుంబాలకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే.. విశాఖపట్నం కేజీహెచ్‌లో 37 మంది విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు.
అమరావతి: కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిల మృతి బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కురుపాం బాలికల గురుకులంలోని విద్యార్థినిలు అనారోగ్యానికి గురైన విషయం తెలిసి బాధపడినట్లు చెప్పారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి పిల్లలు పచ్చకామెర్లు సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇద్దరు విద్యార్థినులు వేర్వేరు రోజుల్లో ఇంటి దగ్గర ఒకరు, మరొకరు ఆసుపత్రిలో మృతిచెందినట్లు పవన్ కల్యాణ్ వివరించారు.
మృతిచెందిన విద్యార్థినిలు కుటుంబాలకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే.. విశాఖపట్నం కేజీహెచ్‌లో 37 మంది విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అదనపు ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకుని నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. త్వరలో కురుపాం వెళ్లి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు