Share News

Suspension: ‘వైపీఎస్‌’ సునీల్‌పై వేటు!

ABN , Publish Date - Mar 03 , 2025 | 02:56 AM

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ పై సస్పెన్షన్‌ వేటుపడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాల్లో పర్యటించడం.. ఒక దేశానికి వెళ్తానని చెప్పి.. మరో దేశంలో

Suspension: ‘వైపీఎస్‌’ సునీల్‌పై వేటు!

  • సీఐడీ మాజీ చీఫ్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

  • ఆ ఐదేళ్లలో ఆరు సార్లు విదేశీ పర్యటనలు

  • ఒక దేశానికి వెళ్లేందుకు పర్మిషన్‌ పొంది వేరే దేశానికి వెళ్లిన సీనియర్‌ ఐపీఎస్‌

  • అనుమతి లేకుండానే కొన్నిసార్లు పయనం

  • అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన

  • నిర్ధారించిన సిసోడియా కమిటీ

  • విదేశాల్లో వ్యాపారాలు, బినామీలు,

  • బంధువులు ఉన్నట్లు అనుమానాలు

  • విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి ఆన్‌లైన్లో పంచారని ఫిర్యాదులు

  • దీంతో త్వరలో ఈడీ కూడా రంగంలోకి!

జార్జియా వెళ్తానంటూ అనుమతి తీసుకుంటారు.. దుబాయ్‌ వెళ్తారు.. అమెరికా వెళ్లేందుకు అనుమతి పొందుతారు.. ఇంగ్లండ్‌లో పర్యటిస్తారు.. రెండ్రోజులు సెలవులు వస్తే అనుమతి తీసుకోకుండా.. చెప్పాపెట్టకుండా స్వీడన్‌ చెక్కేస్తారు.. ఇవన్నీ ఎవరో అంతర్జాతీయ డాన్‌ చేసే విన్యాసాలనుకుంటే పొరపాటు.. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ‘వైపీఎస్‌’ ప్రముఖుడు పీవీ సునీల్‌కుమార్‌ లీలలివి. ఫలితంగా రాష్ట్రప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది.

అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో సీఐడీ అధిపతిగా, నిఘా విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ పై సస్పెన్షన్‌ వేటుపడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాల్లో పర్యటించడం.. ఒక దేశానికి వెళ్తానని చెప్పి.. మరో దేశం లో తిరగడం అఖిల భారత సర్వీసు నిబం ధనలకు విరుద్ధమని తెలిసినా.. గీత దాటారని తేలడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. అనధికారికంగా ఆయన చేపట్టిన విదేశీ పర్యటనలు జాతీ య భద్రతకు ముప్పు తెచ్చేలా ఉన్నాయని తెలిపారు. కీలక స్థానాల్లో పనిచేసే ఐపీఎస్‌ అధికారుల వద్ద చా లా సున్నితమైన సమాచారం ఉంటుందని, పర్యటన ల్లో ఉల్లంఘనలు గమనిస్తే ఆ రహస్య సమాచారం బయటకు పొక్కి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రూ. వేల కోట్ల ఆర్థికపరమైన కేసుల దర్యాప్తు, విదేశాల్లో దాక్కున్న నిందితులపై విచారణలు సీఐడీ పరిధిలోనే ఉంటాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో గుర్తుచేసింది.


తనకన్నా పైస్థాయి అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా వెళ్లడం తీవ్రమైన తప్పుగా పరిగణించిం ది. 2019-24 నడుమ ఐదేళ్లలో ఆరు సార్లు సునీల్‌కుమార్‌ జరిపిన విదేశీ రహస్య పర్యటనల లోగుట్టు వెలికి తీయాల్సి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేవరకు విజయవాడ వదిలివెళ్లొద్దని ఆయన్ను ఆదేశించింది. క్రమశిక్షణ కలిగిన యూనిఫామ్‌ సర్వీసుల్లో 30 ఏళ్లుగా పనిచేస్తున్న సునీల్‌కుమార్‌కు.. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని తెలియదా.. ఒక దేశానికి వెళ్తున్నట్లు చెప్పి మరో దేశంలో పర్యటించడం అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘ న కిందకు వస్తుందని తెలియదా..? అన్నీ తెలిసినా చేశారు. ఎందుకంటే ఆయన వెనకున్నది అప్పటి జగన్‌ ప్రభుత్వం. ఆ ఐదేళ్లలో సీఐడీ, నిఘా, అగ్నిమాపక విభాగాల అధిపతిగా పనిచేసిన ఆయన.. ఐపీసీ చట్టాన్ని పక్కన బెట్టి వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేశారన్న ఆరోపణలు ఉన్నా యి. ఆయన తీరుపై విచారణకు గత నెలలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియాను ప్రభుత్వం నియమించింది. సునీల్‌కుమార్‌ ఆలిండియా సర్వీసెస్‌(కండక్ట్‌) రూల్స్‌ ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. ఐపీఎస్‌ అధికారులు ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాల న్న చైన్‌ ఆఫ్‌ కమాండ్‌ ప్రొటోకాల్‌ను ఆయన పాటించలేదని వెల్లడైంది. దీనిని క్రమశిక్షణరాహిత్యంగా పరిగణిస్తూ డిసిప్లిన్‌ అండ్‌ అప్పీల్‌ రూల్స్‌ కింద ప్రభు త్వం సస్పెండ్‌ చేసింది.


ఆ ఐదేళ్లలో వైసీపీ రాజ్యాంగం..

జగన్‌రెడ్డి పాలనలో ఐపీసీని పక్కన బెట్టి వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేసిన అధికారుల్లో సునీల్‌కుమార్‌ అగ్రస్థానంలో ఉంటారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుం చి ఆదేశాలు అందడమే ఆలస్యం.. సామాన్యులైనా, వృద్ధ మహిళలైనా.. పార్లమెంటు సభ్యుడైనా.. ఎవరినీ వదల్లేదు. సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ శ్రేణులను, జగన్‌ అభిమానులను హై కోర్టే ఆదేశించినా అరెస్టు చేయలేదు. యూనిఫామ్‌ సర్వీసులో ఉంటూ అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ (ఎయిమ్‌) పేరుతో ప్రైవేటు సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. దాని సమావేశాల్లో దేశాన్ని కించపరుస్తూ.. బ్రిటిషర్లను కీర్తిస్తూ ప్రసంగాలు చేశారని ఎప్పుడో ఫిర్యాదులు వచ్చాయి. సునీల్‌కుమార్‌ రాష్ట్రంలో ఏ ఐపీఎస్‌ అధికారి వెళ్లనన్ని సార్లు విదేశాల్లో పర్యటించారు. బినామీ పేర్లతో ఆయనకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. కొన్ని ఆధారాలు కూడా సంపాదించిన సర్కారు.. అనుమానిత వ్యవహారాల సమాచారాన్ని సేకరిస్తోంది. ఏ దేశ విమానం ఎప్పుడు ఎక్కారు.. అనుమతి తీసుకున్న దేశానికి కాకుండా మరో దేశానికి వెళ్లడంలో ఆంతర్యమేంటి.. ఇతర వ్యవహారాలు.. లావాదేవీలపై కూపీలాగుతోంది.


విదేశీ పర్యటనలు ఇలా..

2019 డిసెంబరు నుంచి సునీల్‌కుమార్‌ విదేశీ పర్యటనలు మొదలయ్యాయి. నాటి నుంచి గత ఏడా ది మార్చిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేవరకు పలుమార్లు అంతర్జాతీయ విమానాల్లో చేసిన ప్రయాణాల్లో అనుమతి తీసుకున్న దేశాలకు, ఆయన వెళ్లిన దేశాలకు పొంతన లేదు. 2019 డిసెంబరు 21 నుంచి 2020 జనవరి 4వరకూ అమెరికా వెళ్లేందుకు అనుమ తి తీసుకుని.. ఇంగ్లండ్‌ వెళ్లినట్లు సిసోడియా నేతృత్వంలోని కమిటీ గుర్తించింది. 2021 అక్టోబరులో అనధికారికంగా యూఏఈ వెళ్లారు. 2022 డిసెంబరు 14న జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకుని.. యూఏఈకి కూడా వెళ్లారు. 2023 ఫిబ్రవరి 1న ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండానే హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానం ఎక్కి వెళ్లి నెల రోజుల పాటు అమెరికాలో ఉన్నట్లు కమిటీ నిర్ధారించింది. 2023 సెప్టెంబరులో అనుమతి లేకుండా స్వీడన్‌ వెళ్లినట్లు తేలింది. 2024 మార్చిలో జార్జియా వెళ్లేందుకు ప్రభు త్వం అనుమతిచ్చింది.. అయితే యూఏఈ వెళ్లినట్లు సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా.. ఈ వ్యవహారం లో ఈడీ కూడా త్వరలో రంగంలోకి దిగే అవకాశాలు న్నాయి. విదేశీ నిధులను మతమార్పిడి సంబంధ కా ర్యక్రమాలకు ఖర్చుచేశారన్న ఫిర్యాదులపై ప్రభుత్వం ప్రాథమికంగా విచారణ జరిపింది. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరిపారని గుర్తించింది.

Updated Date - Mar 03 , 2025 | 02:57 AM