Ananthapuram News: ఆకుకూరల ఖిల్లా.. రేకలకుంట
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:26 PM
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకలకుంట గ్రామం.. ఆకుకూరల ఖిల్లాగా ప్రసిద్ధిచెందింది. దాదాపు 45 సంవత్సరాలుగా ఆ గ్రామంలోని సన్న చిన్నకారు రైతులందరూ ఆకుకూరలను పండిస్తూ లాభాలను పొందుతున్నారు.
- కుటుంబికులంతా సేద్యం పనుల్లోనే..
- రోజూ రాబడి
- మెరుగుపడిన కుటుంబాల ఆదాయం
పంటలు పండవు.. ఒకవేళ పండినా గిట్టుబాటు ధరలు దక్కవు.. వ్యవసాయం అంటేనే.. రైతులు ఆలోచించే పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఇదే జిల్లాలోనే తీవ్ర కరువులకు ఎదురొడ్డి నిలిచింది ఓ గ్రామం. అదే బుక్కరాయసముద్రం మండలంలోని రేకలకుంట. ఆకుకూరల సాగులో 45 ఏళ్లుగా లాభాలు పండిస్తూనే ఉంది. ఇంటిల్లిపాదీ సేద్యం పనులు చేస్తుండడంతోనే పెట్టుబడులు తగ్గి.. ఆదాయం సాధిస్తున్నారు. గ్రామంలో 200 కుటుంబాలు ఆకుకూర పంటలు సాగు చేస్తున్నాయి. వేకువజామునే ఇంటిల్లిపాదీ పొలాల్లో ఉంటారు. ఆకుకూరలను కోసి.. ఉదయంలోగా మార్కెట్లకు తరలిస్తారు. జిల్లాలోని చాలా పట్టణాలకు రేకలకుంట నుంచే తాజా ఆకుకూరలు రోజూ సరఫరా అవుతున్నాయి. నిత్య ఆదాయంతో సెంట్ల భూమిలోనే నెలకు వేల రూపాయల ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
బుక్కరాయసముద్రం(అనంతపుం): వ్యవసాయం కలిసిరావడం లేదని రైతు సాగుకు దూరమవుతున్న రోజుల్లో.. ఉన్న కొద్దిపాటి భూమిలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. అర ఎకరం భూమి కూడా అక్షయపాత్రలా మారుతుందని రేకలకుంట గ్రామ రైతులు నిరూపిస్తున్నారు. భూమిలో ఆకుపచ్చ బంగారాన్ని పండిస్తూ నెలకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. గ్రామం చుట్టూ ఎక్కడికెళ్లినా వివిధ రకాల ఆకుకూర పంటలు కనిపిస్తాయి. జిల్లాలోని వివిధ మార్కెట్లకు ఇక్కడి నుంచే ఆకుకూరలను సరఫరా చేస్తున్నారు.

కుటుంబమే అన్నీ..
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రేకలకుంట గ్రామంలో మొత్తం 400 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 200 కుటుంబాలు కేవలం ఆకుకూరల సాగుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కూలీలపై ఆధారపడకుండా కుటుంబ సభ్యులే సాగు పనులన్నీ చేసుకుంటున్నారు. విత్తు నుంచి కోత కోయడం, కట్టలు కట్టడం వరకు అన్నీ వారే చేసుకుంటుండడంతో పెట్టుబడి వ్యయం తగ్గి లాభాలు పొందుతున్నారు. వేకువజామునే... ఈ గ్రామం నుంచి తాజా ఆకుకూరలు తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, పలక, గోగాకు, కొత్తిమీర తదితర రకాలను పట్టణాలు, నగరాలకు సరఫరా చేస్తున్నారు. 45 ఏళ్లుగా పండిస్తున్నారు. కొందరు రైతులు నేరుగా మార్కెట్‌కు వెళ్లి విక్రయిస్తుండగా, మరికొందరు వ్యాపారులకు ఇస్తున్నారు. రేకలకుంట ఆకుకూరలు అంటే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

ఆదర్శంగా సాగు విధానం
రేకలకుంట గ్రామంలో తక్కవ విస్తీర్ణం 20 నుంచి 50 సెంట్ల భూమి కల్గిన రైతులు నిరంతరం పంటలు పండిస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు. తక్కవ నీటితో, స్వల్పకాల పంటలను ఎంచుకోవడం వీరి విజయ రహస్యం. నెలనెలా స్థిరమైన ఆదాయం వస్తుండటంతో నిరుపేదలు కూడా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. భూమిలేనివారు కూడా కౌలుకు తీసుకుని, అందులో ఆకుకూర పంటలు సాగు చేసుకుంటున్నారు.
నెలకు రూ.40 వేలు ఆదాయం
40 సెంట్ల భూమిలోనే... నిరంతరం మెంతాకు, తోటకూర వేస్తున్నాం. రోజుకు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఆకకుకూరల ధరలు తక్కువగా ఉన్నాయి. కనీస ధర లభించినా ఖర్చులుపోను నెలకు రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు వస్తుంది. కుటుంబంలోని అందరం కలిసి పనిచేసుకుంటాం. వచ్చిన డబ్బుతోనే... పిల్లల చదువులు, వివాహాలు చేశాం.
- పద్మజ, రైతు
నాడు కూలీలే... నేడు యాజమానులు
రేకలకుంట గ్రామంలో నాడు కూలీలుగా ఉన్న వారు.. నేడు యాజమానులు అయ్యారు. భూమిలేనివారు కూడా గుత్తకు తీసుకుని, రైతులకు పోటీగా ఆకుకూర పంటలు సాగు చేసుకుంటున్నారు. తద్వారా చాలా కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడ్డాయి. రోజూ ఆదాయం రావడమే ఇందుకు ప్రధాన కారణం.
- లక్ష్మీనారాయణ, రైతు
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News